‘స్వర్ణాంధ్ర విజన్-2047’పై సోమవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ‘చంద్రబాబు ఆనాడు విజన్-2020 గురించి చెబితే అందరూ వెటకారం చేశారు. కంప్యూటర్‌లో అన్నం పెడతారా? అంటూ ఎద్దేవా చేసిన వాళ్లూ ఉన్నారు. హైదరాబాద్‌లోని కొండలు, గుట్టల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవు. అలాంటి ప్రాంతం సైబరాబాద్‌గా అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు. కానీ చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి హైదరాబాదు.. సైబరాబాద్‌గా రూపాంతరం చెందుతుందని, దేశంలోనే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అదే నేడు నిజమైంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రూపొందించిన విజన్-2047కు ప్రజలందరూ సహకరిస్తే.. ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ’ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలనే లక్ష్యం తప్పనిసరిగా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
![]() |
![]() |