ఏపీ అసెంబ్లీ సమావేశాలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు(మంగళవారం) సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అలాగే బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని సభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు అడిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరుకు వరదలు మళ్ళీ రావడం, విజయవాడ మునగడం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. వాగులు, కాల్వల మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కనీసం బుడమేరుకు సంబంధించి మరమ్మతులు కూడా చేయాలేదని సభ్యులు వెల్లడించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ... బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేబినెట్ సమావేశంలో కూడా బుడమేరుపై చర్చ జరిగిందన్నారు. విపత్తుల నిర్వహణ ప్రకారం కేంద్ర సహకారం కూడా అవసరమని తెలిపారు. బుడమేరు పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికపాడు మీదుగా 10 వేల క్యూసెక్కుల తరలింపుపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నామని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
![]() |
![]() |