యాభై ఏళ్ళ నిండిన వాళ్ళకి పెన్షన్ ఎంత మందికి ఇస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారని శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. 12 లక్షల మందికిపైగా యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న మొత్తం పెన్షన్లలో ఈ పన్నెండు లక్షల పెన్షన్లు ఉన్నాయా లేదా అని వైఎస్సార్‌సీపీ సభ్యులు రమేష్, ఇజ్రాయెల్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు యాభై ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ, బీసీలకు పెన్షన్ ఇస్తామని కూటమీ పార్టీలు హామీ ఇచ్చాయని వైఎస్సార్‌సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు అన్నారు. మంత్రి చెబుతున్న జాబితాలో ఉన్న పెన్షన్లు అన్ని కూడా గతంలో ఇచ్చినవేనని, కూటమీ పార్టీలు ఇచ్చిన హమీ మేరకు యాభై ఏళ్ళు నిండిన వారికి ఎన్ని కొత్త పెన్షన్లు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పథకంపై చాలా అపోహలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. చేనేత, ఆదివాసులకు, మత్స్యకారులకు, డప్పు కళాకారులకు, ఒంటరి మహిళలకు, చర్మకారులకు, ట్రాన్స్ జెండర్స్ యాభై ఏళ్ళకే పెన్సన్ ఇవ్వాలని 2014లో చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. ఆ మేరకే 12 లక్షల మందికిపైగా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 33,141 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించామని తెలిపారు. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, త్వరలోనే అందరికి పెన్షన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.
![]() |
![]() |