ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరులో నిలిచిపోయిన మెట్రో సహా అన్ని రవాణా సేవలూ

national |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:36 PM

గత నెల బెలగావీలో ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై మరాఠీ అనుకూలవాదుల దాడికి నిరసనగా కన్నడ సంఘాలు ఈ నెల 22న (శనివారం) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని కన్నడ ఓకూట (కన్నడ సంఘాల కూటమి) ప్రకటించింది. రాజధాని బెంగళూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు అందరూ సహకరించాలని కోరింది. ఇటీవల మరాఠాలో మాట్లాడలేదనే కారణంతో కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో మరోసారి మరాఠా, కన్నడ మధ్య వివాదానికి ఆజ్యం పోసి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.


కన్నడ సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో ప్రజా రవాణా సహా పలు సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో అన్ని రకాల ప్రజారవాణా స్తంభించిపోనుంది. విద్యా సంస్థలు కూడా మూసివేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సేవలను నిలిచిపోనున్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్  ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. పరీక్షల నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు మూతపడతాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. బంద్‌కు ఓలా, ఉబర్, ఆటో రిక్షా యూనియన్ల సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఈ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది.


అటు, హోటల్స్, సినీ పరిశ్రమ ప్రతినిధులు సైతం సంఘీభావం తెలిపారు. కానీ, థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో మహారాష్ట్ర ఏకీకరణ సమితి (ఎంఈఎస్) వంటి మరాఠీ గ్రూపులను నిషేధించాలని, బెళగావి వంటి సరిహద్దు ప్రాంతాల్లో కన్నడ మాట్లాడే ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, బెంగళూరును బహుళ పరిపాలనా జోన్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కన్నడ సంస్కృతిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని మండిపడుతున్నారు.


కర్ణాటకలో మరాఠీ భాషా ఉద్రిక్తతలు మహారాష్ట్రతో ముఖ్యంగా ఉత్తర బెళగావి ప్రాంతంలో దీర్ఘకాలిక సరిహద్దు వివాదం కొనసాగుతోంది ఈ ప్రాంతంలో మరాఠీ మాట్లాడే జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒకవైపు మరాఠా పౌరుషం.. మరోవైపు కన్నడ ఆత్మగౌరవం.. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బెళగావి సహా నాలుగు జిల్లాల్లోని 865 పట్టణాలు / గ్రామాలు తమవంటే తమవని వాదించుకుంటున్నాయి. తమ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర అంటే.. తమ భూభాగాన్ని వదులుకోబోమని కర్ణాటక ఖరాఖండీగా చెబుతోంది. బెలగావీతో పాటు ఒకప్పుడు బొంబాయి రాష్ట్రంలో భాగమైన బీజాపుర్‌, ధార్వాడ్‌, ఉత్తర కెనరా జిల్లాలను.. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మైసూరులో కలపడమే ఈ వివాదానికి మూలం. అప్పటి నుంచి ఈ ప్రాంతాల కోసం మహారాష్ట్ర, కర్ణాటకలు కొట్లాడుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa