గత 34 నెలలుగా కొనసాగుతోన్న ఉక్రెయిన్- రష్యా యుద్దం త్వరలోనే యుగియనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఉక్రెయిన్‌తో సంఘర్షణ ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చించడానికి కూడా తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చిచెప్పారు.
ఆ దేశ పార్లమెంటుతోనే తాను చర్చిస్తానని అన్నారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు వాయిదా పడ్డాయని, జెలెన్‌స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా భావించడం లేదని ఆయన తెలిపారు. గురువారం నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్ నాలుగున్నర గంటల పాటు విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఆయనతో ఏ క్షణమైనా మాట్లాడవచ్చని తెలిపారు. అయితే, నాలుగేళ్లుగా ట్రంప్‌తో తాను మాట్లాడలేదని, శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తానని వివరించారు.
అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని చెప్పారు. తమ దళాలు రోజుకు ఒక చదరపు కిలోమీటరు భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయని అన్నారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ ఫలితం ఇస్తుందని వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన పుతిన్..కీవ్ అధీనంలో ఉన్న కుర్స్క్ ప్రాంతాన్ని రష్యా ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటుందో తనకు తెలియదని అంగీకరించారు. ఆగస్టులో కుర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం ఆక్రమించుకున్న విషయం తెలిసిందే.
అలాగే, యుద్ధంపై అధిక వ్యయం, వర్కర్ల కొరతతో దేశంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు పుతిన్ మాట్లాడుతూ... బయట నుంచి బెదిరింపులు ఉన్నప్పటికీ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. అయితే, ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించే సంకేతామని ఆయన అంగీకరించారు. పశ్చిమ దేశాల ఆంక్షలు కూడా ఇందుకు కారణమని పుతిన్ అంగీకరించారు. ఇదే సమయంలో సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోవడం రష్యా ఓటమిగా భావిస్తారా? అన్న వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘అఫ్గనిస్థాన్ మాదిరిగా ఉగ్రవాద కేంద్రంగా మారకూడదనే మేము పదేళ్ల కిందటే సిరియా నుంచి వచ్చేశామని, మొత్తం మీద మా లక్ష్యాన్ని సాధించాం’ అని పుతిన్ బదులిచ్చారు. ఇటీవల సిరియాను తిరుబాటు దళాలు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయి ఆశ్రయం పొందుతున్నారు. సిరియా అంతర్యుద్ధం సమయంలో రష్యా, ఇరాన్‌లు అతడికి అండగా నిలిచిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa