ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. దీంతో రాజకీయపార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెలరోజుల గడువులో పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిచేసేలా షెడ్యూల్ విడుదల చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకోసం మార్చి 10న ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం మార్చి 18నుంచి 25 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ ఉంటాయి. ఏప్రిల్ 11న పోలింగ్, మే 23న కౌంటింగ్ ఉంటాయి.
సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పటి నుంచి పోలింగ్‌కు నెలన్నరకు పైగా సమయం ఉండేది. ఈసారి మాత్రం నెలరోజుల్లోనే ఏపీలో పోలింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ నిర్ణయించారు. ఇదిలా ఉంటే, జిల్లాలోని ప్రధాన రాజకీయపార్టీలు ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార టీడీపీ ముందంజలో ఉంది. గత ఎన్నికల తీరును బట్టి టీడీపీ అభ్యర్థుల ఖరారు చివరి నిమిషం వరకూ తేలేది కాదనే అభిప్రాయాలున్నాయి. ఈసారి మాత్రం ముందుగానే సుమారు 80శాతం అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా సంకేతాలు పంపించారు. వారంతా ఎన్నికల యుద్ధానికి సన్నద్ధులవుతున్నారు. ఎవరికి వారుగా ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండురోజుల్లో మొదటి జాబితా విడుదలకు టీడీపీ అధిష్ఠానం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీకి దీటుగా నిలవాల్సిన ప్రతిపక్ష వైసీపీ మాత్రం అభ్యర్థుల ఖరారులో వెనుకబడి ఉంది. అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో అంతర్మథనంలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, నిర్లిప్తత చోటుచేసుకున్నాయి.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రె్‌సలో కొంత కదలిక వచ్చినా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. 2014 ఎన్నికల కంటే ఆ పార్టీలో కొంత ఉత్సాహం పెరిగింది. ఆశావహుల సంఖ్య కూడా పెరిగింది. జిల్లాలో అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కానీ, ఇప్పటికీ ఏ ఒక్కరినీ ప్రకటించలేదు. జిల్లాలో హడావుడి చేసిన జనసేనలో ఎన్నికల ఊసే కనిపించలేదు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీచేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అనంతపురం నుంచే పోటీలో నిలుస్తానని బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. కానీ.. ఆయన ఇప్పటికీ ఎక్కడినుంచి పోటీచేస్తారో అర్థంగాక పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఇక బీజేపీ, కమ్యూనిస్టుల వ్యూహమేమిటో ఇంకా స్పష్టత రాలేదు.
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ముందంజ..
2019 ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించడంలో టీడీపీ ముందంజలో ఉంది. 2014 ఎన్నికల్లో 14కు గానూ 12 స్థానాలు దక్కించుకుని.. ఆ తరువాత తన బలం 13కు పెంచుకున్న టీడీపీ.. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, ఇతర ప్రైవేటు సంస్థలు నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా చంద్రబాబు గెలుపు గుర్రాలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఈ నెల 6,7 తేదీల్లో అమరావతిలో జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. తొలిరోజు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను సూచనప్రాయంగా వెల్లడించి వారికి సంకేతాలందించారు. రెండోరోజు రెండు స్థానాలకు అదే పద్ధతి అమలు చేశారు. తొలిరోజు అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్‌రెడ్డి తోపాటు తొమ్మిదిమంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశారు. రాయదుర్గం-మంత్రి కాలవ శ్రీనివాసులు, రాప్తాడు-మంత్రి పరిటాల సునీత, అనంతపురం-వైకుంఠం ప్రభాకర్ చౌదరి, హిందూపురం-నందమూరి బాలకృష్ణ, మడకశిర-ఈరన్న, ధర్మవరం - గోనుగుంట్ల సూర్యనారాయణ, తాడిపత్రి - జేసీ అస్మిత్‌రెడ్డి, ఉరవకొండ - పయ్యావుల కేశవ్, పెనుకొండ- బీకే పార్థసారథికి టికెట్లు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు సూచన ప్రాయంగా తెలిపారు. రెండోరోజు హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్ప, కదిరి-కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి-పల్లె రఘునాథరెడ్డి పేర్లు ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఖరారు చేసిన అభ్యర్థుల్లో తాడిపత్రికి చెందిన జేసీ అస్మిత్‌రెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్‌రెడ్డి కొత్త ముఖాలుగా తెరమీదికి వచ్చారు. వారి తండ్రులైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తమ వారసులకు రాజకీయ పట్టం కట్టాలని కొంత కాలంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. చివరికి వారు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి తమ కుమారులకు అవకాశం కల్పించాలని కోరడంతో ఆ ఇద్దరు వారసులూ ఈ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నారు. కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ మినహా మిగిలిన వారందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. దీంతో ఖరారైన అభ్యర్థులంతా ఎక్కడికక్కడ తమతమ పద్ధతుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ మూడు స్థానాల పరిస్థితిని గమనిస్తే.. సిట్టింగులకు చాన్స్ లేనట్టేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. దాదాపుగా కొత్తముఖాలు తెరమీదికి రావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల హడావుడి మొదలు కావడంతో ఆ మూడు నియోజకవర్గాలకూ కూడా నేడో, రేపో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నాయి.
అంతర్మథనంలో వైసీపీ-
జిల్లాలో వైసీపీ అంతర్మథనంలో ఉంది. అభ్యర్థులను ఖరారు చేసుకుని టీడీపీ ప్రచారం ప్రారంభించినా వైసీపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారులో జాప్యం చేస్తోంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉన్నా చాలా స్థానాల్లో ఇప్పటికీ పోటీచేసే అభ్యర్థి ఎవరో అర్థంగాక పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయనను ఇక్కడి నుంచి తప్పించి ఇంకో స్థానానికి బరిలో దించాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన మాత్రం తాను పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానని, అనంతపురం అర్బన్ నుంచే తాను పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇక రాప్తాడులో తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు వై. వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, కదిరి సిద్దారెడ్డి, పెనుకొండ శంకరనారాయణ, మడకశిర తిప్పేస్వామి, శింగనమల జొన్నలగడ్డ పద్మావతి, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఇక అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉంటానని చెబుతున్నా ఆ స్థానం మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆశిస్తున్నారు. కళ్యాణదుర్గంలో ఇప్పటికే ఉషాశ్రీ చరణ్ పేరు వినిపిస్తున్నా తాజా పరిణామాల్లో తలారి రంగయ్య అక్కడినుంచి పోటీచేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనంతపురం ఎంపీ అభ్యర్థిగా రంగయ్య పేరు తెరమీదికి వచ్చింది. తాజా పరిణామాల్లో భాగంగా దీటైన ఎంపీ అభ్యర్థిగా అనంత వెంకట్రామిరెడ్డిని రంగంలోకి దించితే రంగయ్యను కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, ఉరవకొండలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఎమ్మెల్యే సోదరుడు మధు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గ కన్వీనర్‌గా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. ఎన్నికల బరిలో మాత్రం అక్కడ అభ్యర్థి మారే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ధర్మవరంలో కేతిరెడ్డి కుటుంబం పోటీ చేస్తున్నందున తాడిపత్రిలో ఇతరులకు అవకాశం ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. హిందూపురంలో మొన్నటివరకు నవీన్‌నిశ్చల్ పేరు వినిపించింది. ఉన్నట్టుండి ఆయనను పక్కన పెట్టి ఆ స్థానంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనిని రంగంలోకి దింపారు. ఇప్పుడు మళ్లీ ఆ స్థానానికి రాయలసీమ మాజీ డీఐజీ ఇక్బాల్‌ను తెరమీదికి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
దరఖాస్తులకే కాంగ్రెస్ పరిమితం..
కాంగ్రె్‌స పార్టీలో గత ఎన్నికల నాటి కంటే కొంత కదలిక కనిపించినా ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి బరిలో నిలిచే అభ్యర్థులెవరో స్పష్టత రాలేదు. కళ్యాణదుర్గంనుంచి తాను పోటీలో ఉంటానని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యంకు దరఖాస్తు కూడా సమర్పించారు. మాజీమంత్రి శైలజానాథ్ కూడా శింగనమల నుంచి తాను బరిలో ఉంటానంటూ దరఖాస్తు చేసుకున్నారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేయడానికి 84 దరఖాస్తులు వచ్చాయి. అలాగే రెండు ఎంపీ స్థానాలకు 24 దరఖాస్తులు వచ్చాయి. వారిలో అనంతపురం పార్లమెంటు టికెట్ పీసీసీ నాయకుడు నాగరాజు, మండ్లి నరసింహారెడ్డి, పెరుమాళ్ల జీవానందరెడ్డి, దాదాగాంధీతోపాటు మరికొందరు ఆశిస్తున్నారు. హిందూపురం ఎంపీ స్థానాన్ని చిన్న వెంకటరాముడు, మాజీ ఎమ్మెల్యే టీడీ నాగరాజారెడి,్డ కేటీ శ్రీధర్‌తో పాటు మరికొందరు ఆశిస్తున్నారు. బరిలో ఎవరుంటారనేది అధిష్ఠానం ప్రకటించాల్సి ఉంది.
ఊసేలేని జనసేన, బీజేపీ.. నిస్తేజంలో వామపక్షాలు..
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా జిల్లాలో జనసేన ఊసే కనిపించలేదు. ఏ నియోజకవర్గానికి నాయకులెవరనేది ఇంకా ప్రకటించలేదు. అయినా అనంతపురం నుంచి టీసీ వరుణ్, జయరామిరెడ్డి తామే నాయకులమని ప్రకటించుకున్నారు. ధర్మవరంలో చిలకం మఽధుసూదన్‌రెడ్డి, గుంతకల్లులో పూల రమణ తామే ఆ నియోజకవర్గ అభ్యర్థులమని చెప్పుకుంటున్నారు. మధుసూదన్ రెడ్డి, జయరామిరెడ్డి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు.
జనసేనతో రాజకీయ అవగాహన కుదుర్చుకున్న వామపక్షాల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. జనసేన పోటీచేసే స్థానాలేవో.. తామెక్కడినుంచి బరిలోకి దిగాలో అర్థంగాక ఆ పార్టీల నాయకులు గందరగోళంలో పడిపోయారు. కేంద్రంలో అధికాంలో ఉన్న బీజేపీ కూడా జిల్లాలో నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించినా ఇక్కడమాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పోటీచేయడానికి అభ్యర్థులు కూడా ముందుకు రావడం లేదనే అభిప్రాయాలున్నాయి. జంగటి అమరనాథ్, లలిత్‌కుమార్, కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వంటివారు బరిలో ఉంటారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa