ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఎలమంచిలి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 35 ఏళ్ల కిందట హెరిటేజ్ అనే విత్తనం నాటారని, మా ఖర్చుల కోసం మేం రాజకీయాలపై ఆధారపడం అని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఉపాధి కల్పించాలని, వారు తమ సొంత కాళ్లపై నిలబడాలని చంద్రబాబు అంటుంటారని లోకేశ్ గుర్తుచేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలాంటివారని, వారికి ప్రమాద బీమా మరింత పెంచుతామని స్పష్టం చేశారు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని అలగడం మంచిది కాదని నేతలు, కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, కలిసి పనిచేయాలని సూచించారు. తిట్టుకుందాం, కొట్టుకుందాం... కానీ విడాకులు అవుటాఫ్ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో నేనే నిరంతరం పోరాడుతుంటాను... పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని వివరించారు. తప్పు అనిపిస్తే ఆఖరికి నన్నయినా నిలదీయొచ్చు... టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అని లోకేశ్ ఉద్ఘాటించారు. "చంద్రబాబు అరెస్ట్ బాధ నాలో ఇంకా ఉంది. మంచి రోజులు వచ్చాయని కష్ట కాలాన్ని మర్చిపోకూడదు. కూటమి ధర్మాన్ని నాయకులు, కార్యకర్తలు అందరూ పాటించాలి" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
![]() |
![]() |