రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్ధిని నల్లపు నాగ అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పూర్తిగా అండగా ఉంటామని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎంపీ, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మసీ విద్యార్ధిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు బుధవారం వైయస్ జగన్‌ను కలిశారు. తమ కుమార్తె పరిస్ధితిని వివరించి కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా అంజలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, దుర్గారావు వైయస్ జగన్‌ను కోరారు. ఇందుకు స్పందించిన మాజీ ముఖ్యమంత్రి.. అంజలి కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా కల్పించారు. వైయస్ జగన్‌ను కలిసిన వారిలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు.
![]() |
![]() |