అమరావతి: వైకాపా అక్రమాలను ఈడీ నిర్ధారించినప్పటికీ ప్రధాని మోదీ ఉపేక్షిస్తున్నారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఆరోపించారు. జగన్ కేసులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ డైరెక్టరు కర్నల్‌సింగ్ 2017 మే 31న సీబీఐ డైరెక్టరు ఆలోక్‌వర్మకు రాసిన లేఖ.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన లోపాలను అందులో ప్రస్తావించడం తదితర అంశాలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. దీంతో మోదీ, కేసీఆర్, జగన్ చేసిన మరో కొత్త కుట్ర బయటపడిందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భాజపా, తెరాస చెప్పినట్లు జగన్ వింటున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ను బానిసగా చేసుకుని మోదీ, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. దొంగ వ్యాపారాలు, బోగస్ షేర్లు, ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ ఇలా.. జగన్ నేరాలకు అంతేలేదని సీఎం ధ్వజమెత్తారు. చట్టంలో ఎన్ని నేరాలున్నాయో అన్ని నేరాలు చేసిన వ్యక్తి ఆయనంటూ దుయ్యబట్టారు. ఓటు తొలగింపు కోసం అతనే దరఖాస్తు చేసుకుని ఇతరులపై జగన్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని మోసాలకు గ్రాండ్ మాస్టర్ జగనే అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa