ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోరుగా రాజకీయ వలసలు-అవకాశాల కోసం పార్టీల మార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 08:37 PM

అవకాశాలు వెతుక్కుంటూ రాజకీయ పక్షులు గూళ్లు మారుతున్నాయి. టికెట్టు దక్కనివారు, వేరే పార్టీలో చేరితే మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయన్న ఉద్దేశంతో ఇంకొందరు.. అసమ్మతి, అసంతృప్తితో మరికొందరు పార్టీలు మారుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపాలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించనప్పటికీ చాలా నియోజకవర్గాలపై స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్టు దక్కనివారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కొందరైతే ఉన్న పార్టీల్లో కొనసాగుతూనే, ఇతర పార్టీల్లోనూ ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం అవకాశాల కోసం వలస వెళుతున్నారు. నెల్లాళ్ల కిందటే వలసలు ప్రారంభమైనా ఇటీవల ఎక్కువయ్యాయి. అన్ని పార్టీలనూ సంప్రదించి చివరికి ఏదో ఒక పార్టీ గూటిలోకి చేరుతున్న ఉదంతాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొందరైతే రెండు పడవల్లోనూ కాలు పెడుతూ ఎక్కడ అవకాశం వస్తుందా? అని నిరీక్షిస్తున్నారు. ఫలానా సీటు తమకు ఇస్తేనే పార్టీలో చేరుతామంటూ షరతులు విధిస్తున్నారు. అతి త్వరలో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నందున వలసలు మరింత పెరిగే అవకాశముంది. 


వైకాపా, కాంగ్రెస్‌ల నుంచి తెదేపాలోకి


* కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మంగళవారం చంద్రబాబును కలిశారు. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు.


* అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ మంగళవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెదేపాలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపినట్లు సమాచారం.


* విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైకాపాకు రాజీనామా చేసి చంద్రబాబును కలిశారు. తెదేపాలో చేరేందుకు సుముఖత తెలిపారు.


* కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వెంకటరెడ్డి తెదేపాలో చేరారు. పాణ్యం వైకాపా టిక్కెట్‌ కాటసాని రాంభూపాల్‌రెడ్డికి ఇస్తారనే ఉద్దేశంతో వారు వైకాపాకు రాజీనామా చేశారు.


* కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు  తెదేపా కండువా కప్పుకున్నారు. కర్నూలు ఎంపీ స్థానం నుంచి తెదేపా తరఫున సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేయనున్నారు.


* కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు కిశోర్‌చంద్రదేవ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా తరఫున అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


* గత ఎన్నికల్లో వైకాపా తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆ పార్టీలోనే కొనసాగిన చలమలశెట్టి సునీల్‌ వైకాపాను వీడి తెదేపాలోకి చేరారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


* భీమిలి వైకాపా సమన్వయకర్తగా ఉన్న కర్రి సీతారాం తెదేపాలో చేరారు. అవంతి శ్రీనివాసరావును తన నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా నియమించటాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.


* పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి వైకాపాకు రాజీనామా చేసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.


* మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం హరి త్వరలో తెదేపాలో చేరనున్నారు. 


తెదేపా నుంచి వైకాపాలోకి


* ఎంపీ తోట నరసింహం మంగళవారం తెదేపాకు రాజీనామా చేశారు. వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. తెదేపా తరఫున తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్టు   కోరారు. తెదేపా నుంచి హామీ రాకపోవటంతో పార్టీని వీడారు.


* తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, పర్వత రాజబాబులు తెదేపాకు రాజీనామా చేసి వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.


* పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ భాజపాను వీడి వైకాపాలో చేరారు.


* సినీ నటుడు అలీ తొలుత తెదేపా, జనసేన అధినేతలతో భేటీ అయ్యారు. చివరకు వైకాపాలో చేరారు.


* నవోదయం పార్టీ నుంచి గెలిచి తర్వాత తెదేపాలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవల వైకాపాలో చేరారు.


* అనకాపల్లి, అమలాపురం  తెదేపా  ఎంపీలు  అవంతి శ్రీనివాసరావు, పండుల రవీంద్రబాబు వైకాపా గూటికి చేరారు.


* గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెదేపాకు రాజీనామా చేసి వైకాపా కండువా కప్పుకున్నారు.


* పౌరసరఫరాల సంస్థ మాజీ ఛైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి తెదేపాను వీడి వైకాపాలో చేరారు.


* మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్‌లు వైకాపాలో చేరారు.


* పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్‌, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావులు తెదేపాను వీడి వైకాపాలో చేరారు.


* సినీనటి జయసుధ తెదేపా నుంచి వైకాపాలో చేరారు.
అయ్యయ్యో...


* గోదావరి జిల్లాలకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తెదేపా తరఫున ఓ నియోజకవర్గం టిక్కెట్టు ఆశించారు. అయితే అక్కడ తెదేపా మరొకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటంతో పార్టీని వీడి వైకాపాలో చేరాలని భావించారు. వైకాపాలోనూ ఆయన కోరుకున్న స్థానాన్ని మరొకరికి కేటాయిస్తుండటంతో అక్కడా తనకు అవకాశం ఉండదని నిర్ణయానికొచ్చి ఇప్పుడు తెదేపాలోనే ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.


* గోదావరి జిల్లాలకు చెందిన ఓ ప్రజాప్రతినిధి... 15రోజుల కిందట తెదేపా నుంచి వైకాపాలో చేరారు. అయితే ఆ పార్టీలో ఆయన కోరుకున్న టికెట్టు లభించే అవకాశం లేదని స్పష్టమవ్వటంతో తిరిగి తెదేపాలోకి వస్తానని పార్టీ నాయకులను సంప్రదిస్తున్నారు.


* వారం, పది రోజుల్లో ఈ వలసలు మరింత పెరిగే అవకాశముంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాక ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మరింత మంది మారే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తదితర స్థాయి నాయకులు కనీసం 20 మంది పార్టీలు మారవచ్చని సమాచారం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa