చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 34 శాతం టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. దీనికి తప్పకుండా తగినరీతిలో బదులిస్తామని చైనా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ట్రంప్ టారిఫ్ ల ప్రభావం ‘యాపిల్’ కంపెనీపై పడనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఐఫోన్లను యాపిల్ కంపెనీ చైనాలోనే తయారుచేస్తుంది. గతంలో అదనపు పన్నులు తప్పించుకొనేందుకు యాపిల్ కంపెనీ ప్రత్యేక మినహాయింపు పొందింది. అమెరికా వ్యాపార సంస్థలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను తరలించేలా ఒత్తిడి పెంచడమే ట్రంప్ ఉద్దేశం కావడంతో ఈసారి ఎలాంటి మినహాయింపు ఇచ్చే అవకాశంలేదు. దీంతో ఐఫోన్ల ధరలకు రెక్కలు వస్తాయని, సగటున ఐఫోన్ ధరలు 30 నుంచి 40 శాతం పెరుగుతాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెరిగిన పన్నుల భారాన్ని తానే భరించాలా లేక వినియోగదారుడిపై మోపాలా అనేది యాపిల్ సంస్థ ఇంకా నిర్ణయించలేదు. అయితే, అంతిమంగా వినియోగదారుడిపైనే ఆ భారం మోపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు (సుమారు రూ.68 వేలు). ట్రంప్ టారిఫ్ ల భారం వినియోగదారుడిపై మోపాలని యాపిల్ నిర్ణయిస్తే.. ఈ మోడల్ ధర 1,142 డాలర్ల (సుమారు రూ.97 వేలు)కు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16 ప్రోమ్యాక్స్ (1 టెరాబైట్) 2,300 డాలర్లకు (సుమారు రూ.2 లక్షలకు) చేరవచ్చని నిపుణుల అంచనా.
![]() |
![]() |