మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకు నియోజకవర్గంలో ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమం జరుగనుంది. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు. యర్రబాలెం గ్రామానికి చెందిన 248మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి నీరుకొండ గ్రామానికి చెందిన 99మందికి, రత్నాల చెరువుకు చెందిన 199మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ ఉచితంగా అందజేయనున్నారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను లోకేష్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు పదినెలల్లో పరిష్కారం చూపామని అన్నారు. తొలి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న మూడు వేలమందికి శాశ్వత పట్టాలు అందజేస్తామని అన్నారు. మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సూపర్ 6 హామీలు ఓ పద్ధతి ప్రకారం అమలు చేస్తూనే... మంగళగిరిలో ఏ సమస్య లేకుండా చూసుకుంటానని మాటిచ్చారు.ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన మంగళగిరిలో వందపడకల ఆస్పత్రికి భూమి పూజ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 13వ తేదీకి ప్రారంభిస్తామని అన్నారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తామని సీఎం చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ రెండున్నర దశాబ్దాల కల అని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పదినెలల్లో ఇంటిపట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి వేసి ఆలోచించుకోవాలని చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
![]() |
![]() |