ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన సీనియర్‌ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 07:38 PM

నెల్లిమర్ల నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్‌ రాజకీయ నేతలు గతంలో మంత్రులు, ప్రొటెం స్పీకర్లుగా పనిచేశారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్యే ఇక్కడ గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నాయకుడు పతివాడ నారాయణస్వామినాయుడు ఏడోసారి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. సుమారు 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కలిగిన ఆయన భోగాపురం నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రత్యర్థి వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పి.సాంబశివరాజు కూడా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇరు పార్టీల్లో ఉన్న వారిద్దరికీ రాజధాని స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. వారు గతంలో మంత్రులుగా, ప్రొటెం స్పీకర్లుగా పనిచేశారు. అయితే ఈ సారి ఎన్నికల్లో సాంబశివరాజుకు కాకుండా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైపే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. టీడీపీ అభ్యర్థి ఎవరన్నదీ ఇంకా తేలలేదు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్‌, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేత కడగల ఆనంద్‌కుమార్‌, భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు నెలిమర్ల టీడీపీ టిక్కెట్‌ కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో భోగాపురం నియోజకవర్గంలోని భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాలను నెల్లిమర్లలో విలీనం చేశారు. కొత్తగా ఏర్పాటైన నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్‌ నుంచి సాంబశివరాజు విముఖత వ్యక్తం చేశారు. దీంతో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన బడ్డుకొండ అప్పలనాయుడు పతివాడ నారాయణస్వామినాయుడుపై తొలిసారిగా విజయం సాధించారు. తిరిగి 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు, వైసీపీ నుంచి పోటీ చేసిన సాంబశివరాజు కుమారుడు డాక్టర్‌ పీవీవీ సూర్యనారాయణరాజుపై పతివాడ విజయం సాధించారు. కొత్త నియోజకవర్గం నెల్లిమర్ల గడ్డపై పతివాడ ఏడోసారి విజయకేతనం ఎగురవేశారు. ఈ సారి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా వైసీపీలోకి విలీనమైంది. అయితే ఆ పార్టీ టికెట్‌ మాత్రం బడ్డుకొండనే వరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బడ్డుకొండ 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు డెంకాడ మండల జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న ఆయన జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. వైసీపీ సీనియర్‌ నాయకుడు పి.సాంబశివరాజు 2009కి ముందు పాత నియోజక వర్గాల సమయంలో సతివాడ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు విజయాలను నమోదుచేసుకుని గుర్తింపును పొందారు. అయితే ఇప్పటికే ఆయనకు 86 ఏళ్లు కావడంతో అధిష్ఠానం ప్రాధాన్యతను తగ్గించినట్లు తెలుస్తోంది.
విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు ముఖద్వారంగా ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే గాకుండా తలసరి ఆదాయంలోనూ ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గానికి నెల్లిమర్ల ప్రధాన కేంద్రం కాగా నెల్లిమర్ల మండలంతో పాటు డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాలు ఉన్నాయి. ఇందులో భోగాపురం, పూసపాటిరేగ మండలాలు తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్నాయి. 16వ నంబరు జాతీయ రహదారి కూడా భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల పరిధిలోనే ఉన్నాయి. కొత్తగా నిర్మించతలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం కూడా భోగాపురం మండల పరిధిలోనే ఉంది. జిల్లాలోని ఫార్మాకంపెనీలు అన్నీ పూసపాటిరేగ మండలంలోనే హైవేకు ఆనుకుని ఉన్నాయి. నెల్లిమర్లలో ఉన్న జూట్‌ మిల్లు రాష్ట్రంలోనే అతి పెద్ద జనపనార పర్రిశమ. దీనిపై ఆధారపడి సుమారు 5 వేల మంది ప్రత్యక్షంగా, 30 వేల మంది పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని ఏకైన ప్రైవేటు వైద్య కళాశాల మిమ్స్‌ కూడా నెల్లిమర్లలోనే ఉంది. మరో భద్రాద్రిగా పేరొందిన రామతీర్థం రామస్వామి వారి దేవస్థానం నెల్లిమర్ల మండల పరిధిలోనే ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ నియోజక వర్గంపై అన్ని పార్టీల వారికి ప్రత్యేక దృష్టి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa