అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వ్యూహం ఏంటో అర్థంకాక రాజకీయ విశ్లేషకులు సైతం బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. టీడీపీ, వైసీపీలకు పోటీగా జనసేన గోదావరి జిల్లాల్లో వ్యూహాన్ని రూపొందించింది. నరసాపురం లోక్‌సభ స్థానానికి పవన్ సోదరుడు నాగబాబును బరిలోకి దింపబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తమ పురిటిగడ్డపై అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని మొదటి నుంచి పవన్‌కల్యాణ్ ఆశ పడుతున్నారు. దీనికి తగ్గట్టు జిల్లాలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆరా తీస్తూ వచ్చారు. ఒక దశలో తాను పశ్చిమగోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తానన్నారు. అందులో భాగంగా ఏలూరులో అద్దె ఇల్లు కూడా తీసుకున్నారు. ఓటు హక్కు కూడా అక్కడే ఉంది.
అనంతపురం, శ్రీకాకుళం కూడా తెరమీదకు వచ్చాయి. విద్యార్ధులతో ముఖాముఖి సందర్భంగా కర్నూలు కూడా వార్తల్లోకి వచ్చింది. అయితే అసలు పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ? పార్లమెంటుకా..? అసెంబ్లీకా..? అనేది సస్పెన్స్‌గా మిగిలింది. తాజాగా రాజకీయ ప్రస్తావనలో ఆయన సోదరుడు నాగబాబు పేరు ప్రతిపాదనలోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జనసేన ముఖ్యనేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వాస్తవానికి నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతారని భావించారు. చిరంజీవి ఓటమి పొందిన పాలకొల్లులో తిరిగి పోటీ చేసి గెలవాలనే ఆలోచనలో పవన్ ఉన్నారనే వాదనలు కూడా వినిపించాయి.
నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి నాగబాబుని బరిలోకి దిగితే, మిగతా అసెంబ్లీ స్థానాలపై దీని ప్రభావం పడుతుందని, పార్టీ ఆయా స్థానాల్లో సులువుగా గెలిచేందుకు వీలు ఉంటుందని పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. 2009లో పీఆర్పీ నుంచి పాలకొల్లులో పోటీచేసిన చిరంజీవి...కాంగ్రెస్ అభ్యర్ధి బంగారు ఉషారాణి చేతిలో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.
గతంలో తమ కుటుంబానికి జరిగిన అవమానాలను జనసేన నుంచి గెలుపొంది తిప్పికొట్టాలనే భావనతో ఉన్నట్టు చెబుతున్నారు. అందుకనే నరసాపురం, పాలకొల్లు స్థానాల ప్రతిపాదన కొత్తగా పార్టీలో చర్చకు దారితీసింది. ఇదే తరుణంలో తమ సొంతూరు మొగల్తూరు నరసాపురం పరిధిలోనే ఉండడం పార్టీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈవార్తలను జనసేన వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు. ప్రతిపాదన అయితే వచ్చిందని, అది ఎంతవరకూ వాస్తవం అవుతుందో తెలీదంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa