ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును ఇలా కూడా తొలగించుకోవచ్చు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 11:36 PM

కాలేయం మానవ శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ విడుదలతో పాటు అనేక పనులు నిర్వహిస్తుంది. కొందరికి చిన్నప్పటి నుంచి లివర్ సమస్యలు ఉంటాయి. కొందరికి మద్యపానం అలవాటుతో సమస్య మొదలవుతుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ కాలేయ పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో.. అనేక వ్యాధుల బారిన మనం పడవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, లివర్ ఇన్‌ఫెక్షన్, లివర్ ఫెయిల్యూర్ మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది.


అయితే, చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫ్యాటీ లివర్‌.. దీన్ని హెపాటిక్ స్టీటోసిస్ అని కూడా పిలుస్తుంటారు. లివర్‌ కణాలలో కొవ్వు అతిగా చేరితే.. ఈ పరిస్థితి ఏర్పడుతుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, లివర్‌ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే, కొంతవరకు ఉంటే ఇబ్బందేమీ ఉండదు గానీ మితిమీరితే లివర్‌కు ప్రమాదం. ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్నవారు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని సులభమైన వ్యాయామాలతో ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌తో పాటు కాలేయ సమస్యలు తగ్గించుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు, లైఫ్ స్టైల్ పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.


సైక్లింగ్


క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం శరీరానికి మంచిదని భావిస్తారు. సైకిల్ తొక్కేటప్పుడు, శరీరంలో స్థిరమైన కదలిక ఉంటుందని నిపుణుడు చెప్పారు. ఈ కదలికలు తొడలు, దూడలు, తుంటి, కోర్ కండరాలకు నిరంతరం వ్యాయామం ఇస్తాయి. ఇది గుండె చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడమే కాకుండా కండరాలను బలపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం సైకిల్ తొక్కడం వల్ల తొడ కండరాలు బలపడతాయి. స్వచ్ఛమైన గాలి కూడా మీకు అందుతుంది. అంతేకాకుండా కాలేయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.


నడక


​రోజూ వాకింగ్ చేయడం ద్వారా కాలేయ పనితీరు మెరుగుపర్చుకోవచ్చు. ​వైద్యుల ప్రకారం వేగంగా నడవడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో కాలేయంలో కొవ్వు కరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడేవారికి ఇది బెస్ట్ వ్యాయామం. ప్రతి రోజూ 20 నుంచి 30 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి కి.మీకి నడకలో వేగం పెంచితే ఫలితం అద్భుతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


స్విమ్మింగ్


స్విమ్మింగ్ అనేది చాలా మంచి వ్యాయామం. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్యాయామంతో ఫ్యాటీ లివర్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. కొన్ని రోజుల పాటు క్రమం తప్పుకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. అంతేకాకుండా జీవక్రియ వేగవంతం అవుతుంది. దీంతో.. ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.


యోగాసనాలు


కొన్ని యోగా ఆసనాలు కాలేయ సమస్యలలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యోగాసనాలు కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీని ఫలితంగా కాలేయం బలోపేతం అవుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. యోగా ఆసనాలు వేసేటప్పుడు కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తిగా ఉపయోగించబడటం వల్ల అది కరిగిపోతుంది. యోగా చేయడం ద్వారా, శరీరంలోని ప్రతి భాగంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడుతుంది. అర్ధ మత్స్యేంద్రసనం, గోముఖాసనం, ధనురాసనం వంటి యోగాసనాలు ఫ్యాటీ లివర్ సమస్యల్ని తగ్గించడంలో సాయపడతాయి.


లైఫ్‌స్టైల్ మార్పులు


* అధిక చక్కెర వినియోగం శరీరంతో పాటు కాలేయానికి హానికరం. అధిక చక్కెర వినియోగం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే చక్కెరకు దూరంగా ఉండాలి. కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్‌లు వంటి కాలేయానికి హాని చేసే ఆహారాలకు దూరంగా ఉండండి.


* లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వేయించిన ఆహారాలు, స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. మీ ఆహారంలో ఆకుకూరల్ని భాగం చేసుకోండి.


* ఆహారంలో చేపలు, విత్తనాలు, మొక్కల నూనెలు, సోయాబీన్ నూనె వంటి ఒమేగా 3 రిచ్ ఫుడ్‌లను చేర్చుకోండి. వీటిని తినడం వల్ల కాలేయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.


* తగినంత నిద్ర కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తక్కువ నిద్రపోవడం వల్ల కాలేయం ఎక్కువ ప్రభావం చెందుతుంది. రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa