కశ్మీర్ అంశంపై తరుచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. కవ్వింపు చర్యలకు పాల్పడే దాయాది పాకిస్థాన్.. మరోసారి తన బుద్ది పోనిచ్చుకోలేదు. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. ఈ సందర్శంగా 1947 నాటి దేశ విభజనకు కారణమైన రెండు జాతుల సిద్ధాంతాన్ని ఆయన సమర్థించడం గమనార్హం. విదేశాల్లోని పాకిస్థానీల సమావేశాన్ని ఉద్దేశించి జనరల్ మునీర్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు దేశానికి అంబాసిడర్లు మాదిరిగా ఉన్నారు.. .మీరు ఉన్నత సిద్ధాంతం, సంస్కృతి కలిగిన జాతి అని గుర్తించుకోవాలి.. పాకిస్థాన్ కథను మీ పిల్లలకు చెప్పండి. మన పూర్వీకులు హిందువులకన్నా మనం అన్ని విషయాల్లో భిన్నమని నమ్మారు.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు అన్నింట్లోనూ. అదే రెండు జాతుల సిద్ధాంతానికి పునాది’ అని వివరించారు.
స్వాతంత్య్రానికి ముందు రెండు జాతుల సిద్ధాంతం ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనే ఉద్యమానికి పునాది వేసింది. దీనికి ముహమ్మద్ అలీ జిన్నా నేతృత్వం వహించారు. అయితే, ఈ సిద్ధాంతం భారత్, పాకిస్థాన్‌కు ఉన్న సామాన్య చరిత్ర, వారసత్వ భావనలకు విరుద్ధం. అలాగే, ఇది సెక్యులరిజం మూలాలకు కూడా వ్యతిరేకం.
తన వ్యాఖ్యల గురించి జనరల్ మునీర్ మరింత స్పష్టత ఇస్తూ.. ‘భారత్, పాకిస్థాన్ రెండు వేర్వేరు దేశాలు. మనం ఒక్కటే జాతి కాదని మన పూర్వీకులు భావించారు. అందుకే ఈ దేశాన్ని ఏర్పాటు చేసేందుకు వారు పోరాడారు.. వారి త్యాగాలను మేము మర్చిపోలేం. ఈ కథను మీ తరువాతి తరాలకు చెప్పండి. వారికి పాకిస్థాన్ పట్ల బంధం ఎప్పటికీ బలహీనపడకూడదు’ అని అన్నారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం కారణంగా పెట్టుబడులు రావని కొంతమంది భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘ఉగ్రవాదులు దేశ భవితవ్యాన్ని చెరిపేయగలరా? 1.3 మిలియన్ మంది ఉన్న భారత సైన్యం కూడా మమ్మల్ని భయపెట్టలేదు.. అలాంటిది ఈ ఉగ్రవాదులు మన సైన్యాన్ని ఏమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు.
బలూచీస్థాన్ వేర్పాటువాదంపై కూడా పాక్ ఆర్మీ చీఫ్ స్పందించారు. ‘బలూచీస్థాన్ పాక్‌కు గర్వం. మీరు దానిని వేరు చేయలేరు.. పదిహేను తరాలైనా దాన్ని సాధించలేరు.. మేము ఈ ఉగ్రవాదులను తొందరలోనే ఓడిస్తాం. పాకిస్థాన్ ఎప్పటికీ పడిపోదు’ అని ఇటీవల బలూచ్ ఘటనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్‌పై గురించి మాట్లాడుతూ.. ‘మన వైఖరి స్పష్టంగా ఉంది.. అది మన జీవనాడి. అది మన జీవనాడిగానే ఉంటుంది. మేము దానిని మర్చిపోం. మన కశ్మీరీ సోదరుల పోరాటానికి బాసటగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ ఇంకా దీనిపై స్పందించలేదు. కానీ జనరల్ మునీర్ వ్యాఖ్యల దృష్ట్యా, త్వరలోనే తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ వ్యాఖ్యల అర్థం ఏమిటి?
పాక్ ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యం ప్రభావితం చేస్తుందనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో జనరల్ మునీర్ వ్యాఖ్యలు పాక్ ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసేలా కనిపిస్తున్నాయి. భారత్ పట్ల వారి కుటిల వైఖరి ఎప్పటికీ మారదని పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. రెండు జాతుల సిద్ధాంతాన్ని పునరుద్ఘాటిస్తూ పాక్ ప్రజలలో జాతీయ భావనను మరింత బలపరచాలని ఆయన ఉద్దేశం. దశాబ్దాలుగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య కశ్మీర్ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో పాక్ బుద్ది మారలేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. భారత్ పట్ల ఈ విధమైన వ్యతిరేక భావాలు రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa