అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రారంభించిన వాణిజ్య యుద్దం ప్రభావాలు అనేక పరిశ్రమలపై పడుతున్నాయి. చైనా రేర్ ఎర్త్ మెటల్స్‌ను నిలిపివేయడంతో అనేక పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరొమ్ పావెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పరిపాలనలో తీసుకున్న విధాన మార్పుల కారణంగా అమెరికన్ ఫెడ్ రిజర్వ్ అగాథంలో కూరుకుపోతుందని పావెల్ హెచ్చరించారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చికాగోలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పావెల్ మాట్లాడుతూ.. ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన సుంకాల పెంపు అంచనా వేసిన దానికంటే గణనీయ ప్రభావం ఉందని పావెల్ చెప్పారు. ఈ విధానాల చుట్టూ నెలకొన్న అనిశ్చితి దీర్ఘకాలిక ఆర్ధిక నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ‘ఇవి మౌలిక విధాన మార్పులు... వీటిని ఎలా పరిశీలించాలో అనే ఆధునిక అనుభవం మనకు లేదు’ అని పావెల్ అన్నారు.
ఉద్యోగావకాశాల ప్రోత్సాహం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ఫెడ్ బాధ్యతలు. అయితే ట్రంప్ టారిఫ్ విధానం ఈ రెండు లక్ష్యాలకు సైతం ముప్పు తీసుకొస్తుందని పావెల్ హెచ్చరించారు. తాజా డేటా ప్రకారం అమెరికా ఆర్ధికవ్యవస్థ స్థిరంగా ఉన్నప్పటికీ, కొంత మందగమనం కనిపిస్తోందని ఆయన తెలిపారు. ‘ఆర్ధిక వ్యవస్థ మందగమనం కనిపిస్తోంది.. అయితే టారిఫ్‌లు తలెత్తిన తర్వాత ప్రజలే వాటిని కొంతమేర భరించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ద్రవ్యోల్బణం పెరగొచ్చు’ అని పావెల్ అభిప్రాయపడ్డారు. అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లలో కనిపిస్తున్న అస్థిరతను కూడా పావెల్ ప్రస్తావించారు.
ట్రేడ్ వార్.. స్టాక్స్‌పై దెబ్బ
వాణిజ్య యుద్ధం కారణంగా తలెత్తిన అస్థిరత వాల్ స్ట్రీట్‌లో స్పష్టంగా కనిపించింది. నాస్డాక్ ఒక దశలో 4%కి పైగా పడిపోయింది. ఎస్ అండ్ పీ 3%కిపైగా, డౌ జోన్స్ 2%కి పైగా పడిపోయాయి. నెవిడా స్టాక్స్ దారుణంగా పతనమయ్యాయి. ఏఖంగా 10 శాతానికిపైగా పడిపోయింది. చైనా మీద విధించిన ప్రతీకార సుంకాలు కారణంగా అధిక వ్యయాలు వచ్చాయని కంపెనీ తెలిపింది.
ట్రంప్ ముందుకు
ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం ఆందోనలను కొట్టిపారేస్తూ తన నిర్ణయాలను సమర్దించుకుంటూ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ధైర్యంగా ఉన్నారు. జపాన్‌తో జరిగిన చర్చలపై “Big Progress!” అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వివిధ దేశాలతో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న లక్ష్యంతో సుంకాలను ఆయుధంగా వాడుతున్న ట్రంప్.. ఇవి అమెరికా ఉత్పత్తులకు ఎదురులేని అవకాశాలు కల్పిస్తాయని ఆశిస్తున్నారు. అదే సమయంలో గ్లోబల్ తయారీ వ్యవస్థను అమెరికా వైపునకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
టారిఫ్ యుద్ధంలో ఎవరూ విజేతలు కారు.. చైనా వార్నింగ్
వాణిజ్య భాగస్వామ్య దేశాలకు ట్రంప్ 10% టారిఫ్ విధించినప్పటికీ, చైనా ఉత్పత్తులపై 145% వరకు సుంకాలు విధించారు. దీని ప్రతిస్పందనగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125% సుంకాలు విధించింది. దీంతో ట్రంప్ మరింత రెచ్చిపోయి దానిని 245 శాతానికి పెంచారు. ఈ చర్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. ‘అమెరికా నిజంగా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలనుకుంటే, ఒత్తిడి తేవడం, బెదిరింపులు మానుకోవాలి. సమానత, గౌరవం, పరస్పర లాభం ఆధారంగా చర్చలు జరపాలి” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియన్ వ్యాఖ్యానించారు.
‘టారిఫ్ యుద్ధం లేదా ట్రేడ్ వార్‌లో గెలుపెవరికీ ఉండదు.. అయినా చైనా యుద్ధం కోరుకోవడం లేదు, కానీ భయపడబోదు’ అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, చైనా తన తొలి త్రైమాసికంలో అంచనాలకు మించి మెరుగైన వృద్ధిని సాధించినట్లు తెలిపింది. మొత్తం 5.4% వృద్ధి సాధించినట్టు తెలిపింది. ట్రంప్ సుంకాల అమలుకు ముందు ఎగుమతులు వేగంగా పూర్తిచేయాలన్న ఉద్దేశంతో తయారీదారులు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్టు విశ్లేషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa