ఓటు హక్కు యొక్క నైతిక విలువ తెలియపరిచేలాగ ఓటర్లను చైతన్యవంతులను చేసే దిశలో సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచర ణతో ముందుకు వెళ్ళాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి సుజాత శర్మ పేర్కొన్నారు. స్వేచ్చగా, పారదర్శకంగా రాష్ట్రంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతోందన్నారు.
వెలగపూడిలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శుక్రవారం స్వీప్ (SVEEP) సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ఔన్నత్యం, ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై పాఠశాల స్థాయిలో చక్కని కార్యక్రమాలను రూపొందించడం జరుగుతున్నదన్నారు. ఉన్నత విద్య, కాలేజీల స్థాయిలో విద్యార్ధిని, విద్యార్ధులకు విస్తృత స్థాయిలో ఈవీఎంలు, వీవీప్యాడ్లు, డమ్మీ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ, తదితర శాఖల పరిధిలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కాలేజీల ఆధ్వర్యంలో ఓటు హక్కు విలువ తెలియజేసే కార్యక్రమాలను ఏర్పాటు చేయవలేనని కోరారు. వకృత్వపు పోటీలను నిర్వహించడంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో కాలేజీ విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతిగా రూ.7,500/-, తృతీయ బహుమతిగా రూ.5,000/- అందజేస్తున్నామని, జిల్లా స్థాయిలో వకృత్వపు పోటీలలో ప్రథమ బహుమతిగా రూ.5,000/-, ద్వితీయ బహుమతిగా రూ.2,500/- అందజేస్తామన్నారు. జిల్లా స్థాయిలలో ఎంపికైన విద్యార్ధులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. పెయింటింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నామని ప్రథమ బహుమతిగా రూ.10,000/-, ద్వితీయ బహుమతిగా రూ.7500/-, తృతీయ బహుమతి గా రూ.5,000/- లు అందచేయడం జరుగుతుందన్నారు. యువతతోపాటు ముఖ్యంగా మహిళలను ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందని ఇందుకోసం జిల్లా గ్రామీణాభి వృద్ధి సంస్థ పరిధిలోని మండల సమాఖ్యల, గ్రామ సమాఖ్యలతో సమావేశాలను నిర్వహించాలని అదనపు సీఈఓ సుజాత శర్మ సూచించారు. యువతకు ఓటు యొక్క ఔన్నత్యాన్ని వివరించే దిశలో యువజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఉన్నత విద్య, కాలేజీల స్థాయిలో “మాక్ పోల్” పై విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించా లని, ఇందులో ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్తలను భాగస్వాములను చేయాలన్నారు. ఓటు హక్కు కలిగివున్నారో, లేదో తెలుసుకునే విధానంలో కాల్ సెంటర్లలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఎక్కువ స్థాయిలో ఫోన్లు రావడం జరుగుతున్నదని వాటిలో 80 నుండి 90 శాతం మేర కాలర్లకు సంతృప్తికరమైన సమాధానాన్ని అందిస్తున్నామన్నారు. ఒక వేళ కాల్ కనెక్ట్ అవ్వకపోతే ఆయా ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని అందించడం ద్వారా సేవలను అందిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాలలో ఓటర్లు చైతన్యవంతులు అవుతున్నారని ఇంకా గ్రామీణ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఓటర్లను చైతన్యపరచే కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లాల్సివుందన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఓటు హక్కు యొక్క నైతికతను వివరించాల్సి ఉంటుందన్నారు. ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు మొబైల్ తో పాటు, 1950 టోల్ ఫ్రీ నెంబర్లను, వెబ్సైట్లను నిర్వహిస్తున్నామన్నారు. గిరిజన, ఐటిడిఎ ప్రాంతాలలో ఓటింగ్ సరళిని పెంచేందుకు ఆయా ప్రాంతాలలోని రిటర్నింగ్ అధికారులు ముందస్తు ప్రణాళికలను రూపొందించడంతో పాటు అక్కడి ఓటర్లకు ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలను రూపొందించాలని ఆమె సూచించారు. ఓటు హక్కు వినియోగించే సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడంలో భాగంగా ప్రత్యేక క్యూలైను, వీల్ చైర్, రవాణా సదుపాయం తదితర ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఇందు కోసం విభిన్న ప్రతిభావంతుల శాఖ అధ్వర్యంలో తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒక పోలింగ్ బూత్¬లో 50 మించి విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లు ఉన్న ఎడల ప్రత్యేక రవాణా సదుపాయాన్ని కలుగజేసేందుకు విభిన్న ప్రతిభావంతుల శాఖ రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకోవాలని సుజాత శర్మ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa