ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత ప్రభుత్వం

international |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 06:05 AM

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి ఘటనలో "బాహ్య శక్తుల హస్తం" ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో, భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ  ఈ మేరకు కీలక చర్యలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దశాబ్దాల నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయడం, అటారీ-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం వంటి ప్రధాన నిర్ణయాలున్నాయి.భారత్ తీసుకున్న అత్యంత కీలకమైన చర్యల్లో 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం ఒకటి. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరు. 1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1965, 1971, 1999 యుద్ధాల సమయంలోనూ నిలిచిన ఈ చారిత్రక ఒప్పందాన్ని భారత్ ఇప్పుడు నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా విడనాడే వరకు ఈ ఒప్పందం నిలిపివేతలో ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.మరో కీలక నిర్ణయంగా, అటారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే అనుమతులతో సరిహద్దు దాటిన వారు 2025 మే 1వ తేదీలోగా ఇదే మార్గం గుండా తిరిగి తమ దేశాలకు వెళ్లవచ్చని సూచించారు. సార్క్ వీసా మినహాయింపు పథకం  కింద పాకిస్థానీయులకు వీసాలు నిలిపివేశారు. గతంలో జారీ చేసిన ఎస్.వీ.ఈ.ఎస్. వీసాలను రద్దు చేశారు. ప్రస్తుతం ఆ వీసాపై భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.ఇంకా, న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని నేవల్, ఎయిర్ అడ్వైజర్లను 'పర్సన నాన్ గ్రాటా'  ప్రకటించారు. వారు వారం రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీనికి ప్రతిగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి నేవీ, ఎయిర్ అడ్వైజర్లను భారత్ ఉపసంహరించుకోనుంది. ఇరు దేశాల హైకమిషన్లలో ఈ పోస్టులు రద్దయినట్లేనని ప్రకటించారు. ఈ అధికారుల సహాయక సిబ్బంది ఐదుగురిని కూడా ఇరువైపులా వెంటనే ఉపసంహరించనున్నారు. ఇరు దేశాల హైకమిషన్లలోని మొత్తం సిబ్బంది సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించనున్నారు. ఈ తగ్గింపు ప్రక్రియ 2025 మే 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.సీసీఎస్ సమావేశంలో భద్రతా పరిస్థితులను సమీక్షించి, భద్రతా దళాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు విక్రమ్ మిస్రీ తెలిపారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఇటీవల తహవ్వూర్ రాణాను అప్పగించిన తరహాలోనే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన నొక్కి చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు విజయవంతంగా జరగడం, ఆ ప్రాంతం ఆర్థిక వృద్ధి వైపు పయనిస్తున్న తరుణంలో ఈ దాడి జరగడాన్ని సీసీఎస్ తీవ్రంగా పరిగణించిందని మిస్రీ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa