పహల్గాం ఉగ్రదాడి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎందరికో కడుపుకోతను మిగిల్చింది.. మరేందరో చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. కన్నవారు, కట్టుకున్న వారి ఎదుటే.. తెగబడి ప్రాణాలు తీస్తుంటే.. ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాధితులు.. వారిని ఎలా కాపాడుకోవాలో తెలియక వారి కుటుంబ సభ్యులు విలవిల్లాడారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో కర్ణాటకకు చెందిన భరత్ భూషణ్ కూడా ఉన్నాడు. భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఆయనకు అదే చివరి రోజు అవుతుందని ఊహించలేదు. కొడుకు పుట్టినప్పుడే అతడి భవిష్యత్తుకు సంబంధించి వందేళ్లకు సరిపడా ప్రణాళికలు రచించుకున్న ఆ తండ్రి.. మూడేళ్ల పసిప్రాయంలోనే కొడుకును వదిలి వెళ్లే పరిస్థితులు తలెత్తి నరకం అనుభవించాడు. చావు కళ్ల ముందుకు వచ్చిన ఆ క్షణం కూడా ఆ తండ్రి కుమారుడి భవిష్యత్తు గురించే ఆందోళనపడ్డాడు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కన్ను మూశాడు. ఇప్పుడు ఆ చిన్నారి పరిస్థితి ఏంటని తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుంది.
కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు రెండు రోజుల క్రితం అనగా మంగళవారం నాడు దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. పర్యాటకులను చుట్టుముట్టి.. అతి సమీపం నుంచి వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన వారిలో భరత్‌భూషణ్ ఒకరు. దాడి సమయంలో ఆయన భార్య, మూడేళ్ల కుమారుడితో బైసరన్ ప్రాంతంలో సరదాగా గడుపుతున్నారు. అయితే అవే తనకు ఆఖరి క్షణాలు అవుతాయని ఆయన ఏమాత్రం ఊహించలేకపోయారు.
భర్త మరణాన్ని అత్యంత సమీపంనుంచి చూసిన భరత్ భూషణ్ భార్య సుజాత బాధను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. "ఏప్రిల్ 18న మేం వెకేషన్ కోసం ఇంటి నుంచి వెళ్లాం. పహల్గాం మా పర్యటనలో చివరి ప్రాంతం. గుర్రాలపై మేం బైసరన్‌కు వెళ్లాం. అక్కడికి వెళ్లిన తర్వాత కశ్మీరీ కాస్ట్యూమ్స్ ధరించి ఫొటోలు తీసుకున్నాం. నేను, నా భర్త.. ఇద్దరం కలిసి మా పిల్లాడితో ఆడుకుంటున్నాం. అప్పుడే ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. పక్షులు, అడవి జంతువులను వెళ్లగొట్టేందుకు అలా శబ్దాలు చేస్తున్నారేమో అని భావించాం. కానీ రాను రాను ఆ శబ్ధం మాకు అత్యంత దగ్గరగా రాసాగింది. అప్పుడే మాకు అర్థం అయ్యింది దాడి జరుగుతుందని" చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ.. "దాడి జరుగుతుందని అర్థం అయ్యి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాం. కానీ మేం దాక్కునేందుకు ప్లేస్ లేకుండా పోయింది. బైసరన్ ఒక పెద్ద మైదానం కదా.. మేం సరిగ్గా మధ్యలో ఉన్నాం. చివరకు టెంట్ల వెనక్కి వెళ్లాం. అవి కూడా మైదానం మధ్యలోనే ఉన్నాయి. మేం అక్కడ దాక్కున్నా.. ఏం జరుగుతుందో మాకు కనిపించింది. మా కళ్ల ముందే మారణహోమం జరిగింది. ప్రతిఒక్కరినీ బయటకు లాగి, వివరాలు కనుక్కొని, కాల్చివేశారు. మా కళ్ల ముందే ఒక వ్యక్తిని తలలో గురిపెట్టి రెండుసార్లు కాల్చారు. మా టెంట్‌కు దగ్గర్లో ఒక ఉగ్రవాది మాటలు నాకు వినిపించాయి. మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా..? అనడం వినిపించింది" అని గుర్తు చేసుకుంది.
"అప్పటికే మేం భయంతో వణికిపోతూ.. ప్రాణాలు అరచేతపట్టుకొని ఉన్నాము. ఇంతలో ఒక ఉగ్రవాది నా భర్త వద్దకు వచ్చాడు. ఏమీ ప్రశ్నించకుండానే నా కళ్ల ముందే నా భర్తను కాల్చి చంపాడు. అప్పటికే నా భర్త అతడిని ఎంతో వేడుకున్నాడు. నాకో చిన్న పిల్లాడు ఉన్నాడు.. దయచేసి వదిలేయండని బతిమాలాడు. కానీ ఆ ఉగ్రవాది కనికరించలేదు" అంటూ జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుని ఆమె గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె బాధ చూని ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఇక ఈ దాడికి బలైన వ్యక్తుల్లో కొత్తగా పెళ్లైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, శుభమ్ ద్వివేది ఉన్నారు. తమ భార్యాపిల్లలతో వచ్చిన ప్రశాంత్ శత్పతి, శైలేష్, అమెరికాలో స్థిరపడిన మరో కుటుంబం ఉంది. ఇలా చెప్పుకుంటూపోతే ఒక్కొక్కరిది ఒక కన్నీటి గాథ అవుతుంది. వీరికి ఇలాంటి దుస్థితి కల్పించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa