ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ పౌరులు భారత్‌లో ఉంటే 3 ఏళ్లు జైలు, రూ.3 లక్షల ఫైన్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 10:05 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. ఈ దాడికి ప్రతీకారంగా పాక్‌పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ-సీసీఎస్‌ ఇటీవల 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా భారత్‌లో ఉంటున్న పాక్ దేశస్థులు.. ఈనెల 27వ తేదీ లోపు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్ వీసాలపై భారత్‌కు వచ్చిన వారికి ఈ గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ గడువు ముగియడంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్న పాక్‌ వాసులకు గట్టి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎవరైనా పాక్ వీసాలతో ఇంకా భారత్‌లో ఉంటే వారికి ఫైన్, జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఇక అనారోగ్య కారణాలతో మెడికల్ వీసా కలిగి ఉన్నవారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఉంది.


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా ఇక్కడే ఉంటే.. వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనికోసం ఇటీవల తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారిని అరెస్ట్ చేసే అవకాశం కల్పించారు. అనంతరం విచారణ చేపట్టి.. గరిష్ఠంగా మూడేళ్ల పాటు జైలు శిక్ష.. లేదా రూ.3 లక్షల జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార, పర్యాటక, విద్యార్థి సహా 12 విభాగాల్లో వీసాలు పొంది భారత్‌కు వచ్చి ఉన్నవారు ఆదివారం నాటికి పాకిస్తాన్ తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఇటీవలె స్పష్టం చేసింది.


ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌- 2025 ప్రకారం.. గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉండటం.. వీసా నిబంధనలు ఉల్లంఘించడం.. నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధించే అధికారం ఉంటుంది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో ఇప్పటికే చాలా మంది పాక్ దేశస్థులు తమ దేశానికి వెళ్లిపోయారు. కానీ కొందరు ఇంకా భారత్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.


మరోవైపు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ దేశస్థులను గుర్తించి వెంటనే వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి చెప్పారు. దీంతో ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఉన్న పాక్‌ పౌరులను గుర్తించి.. తమ దేశానికి వెళ్లిపోవాలని సూచించాయి. ఈ క్రమంలోనే అనేక మంది పాక్ వాసులు అట్టారీ-వాఘా సరిహద్దు గుండా వారి దేశానికి వెళ్లిపోయారు. గత 3 రోజుల్లో అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా 509 మంది దేశం దాటినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు.. పాకిస్తాన్‌లో ఉన్న 745 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa