తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో చల్లటి సాయంత్రం వేళ స్వామివారు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకుని పరవశించి పోయారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.