చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ఎంతో కేరింగ్ తీసుకుంటారు. వారికి ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. వెంటనే వారికి తగిన చికిత్స అందిస్తారు. అయితే, పిల్లల శారీరక ఆరోగ్యంపై దృష్టి పెడితే సరిపోదు. పిల్లల మానసిక ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరం. పెద్దలు ఎంత ఆందోళన చెందుతారో, పిల్లలు కూడా కొన్ని పరిస్థితుల గురించి ఆందోళన చెందే లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పెద్దలు తమ ఆందోళన గురించి ఎవరికైనా చెప్పగలుగుతారు. కానీ, పిల్లలు తమ ఆందోళన గురించి అంతగా చెప్పుకోలేరు.
పిల్లల తమ ఆందోళనను వ్యక్తపర్చడంలో విఫలం కావచ్చు. పిల్లలు ఏదైనా పని చేసే ముందు భయపడటం, అరచేతులు చెమటలు పట్టడం, ఇతరుల్ని కలవడానికి ఆసక్తి చూపకోవడం లాంటివి చేస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు తమ ఆందోళన గురించి తల్లిదండ్రులకు చెప్పాలని ట్రై చేస్తారు. కానీ చాలా సార్లు తల్లిదండ్రులు వారు చెప్పేది అంతగా పట్టించుకోరు. పిల్లల్లో ఆందోళన ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని పిల్లల సైకియాట్రిస్ట్ నమత్రా సింగ్ వివరించారు. డాక్టర్ ప్రకారం ఆ లక్షణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆకలి తగ్గడం, నిద్ర పోకపోవడం
పిల్లల్లో ఆందోళన ఉంటే అది వారి నిద్ర, ఆకలిని కూడా ప్రభావితం చేస్తుంది. గతంలో ఆటల్లో లేదా కార్యకలాపాల్లో పాల్గొనడంలో చురుగ్గా ఉండే పిల్లలు ఇప్పుడు ఆసక్తి కోల్పోతే జాగ్రత్తగా ఉండాలి. డ్రాయింగ్, డ్యాన్స్, సింగింగ్ వంటి వాటిలో ముందుండే పిల్లలు ఒకసారిగా డల్ అయితే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలానే, కొన్ని భౌతిక లక్షణాలు స్పష్టంగా కనపిస్తాయి.
కోపం, చిరాకు పడటం
పిల్లలు ఏదైనా సమస్య వల్ల ఆందోళన చెందుతుంటే అది వారి మానసిక ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పిల్లలు ఏదైనా పని చేసే ముందు కోపంగా లేదా చిరాకుగా మారతారు. చిన్న చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతుంటారు. పిల్లల్లో ఇలాంటి లక్షణం పదే పదే కనపిస్తే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాలి. లేదంటే పిల్లలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.
సిగ్గుపడటం, మొహమాటం
పిల్లలు ఇంటి నుంచి బయటకు రావడానికి సిగ్గుపడుతుంటే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. అంతేకాకుండా ఇతరుల ముందు సిగ్గుపడటం, మొహమాటం లాంటివి చూపిస్తే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాల్సిందే. పిల్లల ఆందోళన సమస్య ఉంటే వారు ఏ పార్టీకి లేదా బంధువుల ఇంటికి వెళ్లకుండా ఉంటారు. కొన్నిసార్లు షాపింగ్ చేయడానికి కూడా నిరాకరిస్తారు. పిల్లలు పాఠశాలకు వెళ్లాలని లేదా స్నేహితులను కలవాలని కూడా అనిపించదు. ఈ లక్షణాల్ని తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు అంటున్నారు.
కడుపు నొప్పి, తల నొప్పి
పిల్లల్లో ఆందోళన ఉంటే కొన్ని భౌతిక లక్షణాలు కూడా కనిపిస్తాయి. వారు పదే పదే తల నొప్పితో సతమతమవుతుంటారు. ఏ కారణం లేకుండా తల నొప్పి, కడుపు నొప్పితో పిల్లలు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు చాలా కేరింగ్‌గా ఉండాలి. పిల్లల్ని సరైన వైద్యుని దగ్గరికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తల్లిదండ్రులు నెగ్లెట్ చేయకూడదు.
తల్లిదండ్రులు ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
* ఏదైనా పని చేయడానికి పిల్లలు ఆసక్తి చూపకపోవడం
* పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవడం
* రాత్రి పూట తక్కువగా నిద్రపోవడం
* బయటకు వెళ్లడానికి భయపడటం
* ఇతరులతో కలవకపోవడం
* చదువు మీద ఆసక్తి చూపించకపోవడం
* ఇలాంటి లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే అలర్ట్ అవ్వాలి.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
* పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు తల్లిదండ్రులు భావిస్తే వారితో ఓపెన్‌గా మాట్లాడటానికి ప్రయత్నించండి.
* బిడ్డ దేని గురించి ఆందోళన చెందుతున్నారో కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
* పిల్లల చెప్పేది శ్రద్ధగా వినండి. అంతేకానీ, పిల్లలు చెప్పే విషయాల్ని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో మీరు నష్టపోయేది.
* ప్రతి విషయంలో తల్లిదండ్రుల మద్ధతు ఉంటుందని అనిపించేలా పిల్లలకు భరోసా కల్పించండి. వారితో సౌకర్యంగా ఉండేలా ప్రయత్నించండి.
* పిల్లలకు సమతుల్య ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి.
* పిల్లల ఆరోగ్యంపై ఆందోళన ప్రభావం ఎక్కువగా కనిపిస్తే, ఆలస్యం చేయకండి. మంచి మనస్తత్వవేత్త లేదా కౌన్సెలర్‌తో మాట్లాడండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa