ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లీష్‌లోనే మాట్లాడతానన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్.. నెటిజన్లు ఫైర్

national |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:26 PM

కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న సూర్యనగర ఎస్‌బీఐ శాఖలో చోటుచేసుకున్న భాషా వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఓ కస్టమర్ ఆ బ్రాంచ్ మేనేజర్‌ను కన్నడలో మాట్లాడాలని కోరగా.. ఆమె అందుకు అంగీకరించలేదు. తాను కన్నడలో కానీ హిందీలో కానీ అస్సలే మాట్లాడనని చెబుతూ.. కేవలం ఇంగ్లీషులోనే సమాధానం ఇచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీంతో అనేక మంది మేనేజర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌బీఐ.. సదరు మేనేజర్‌ను బదిలీ చేసింది. అయితే తాజాగా ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. స్థానిక భాషలను గౌరవించాలని చెబుతూనే.. బ్యాంకు ఉద్యోగులు ఆయా భాషల్లో మాట్లాడేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు.


బెంగళూరులోని సూర్యనగరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్‌తో గొడవ పడ్డారు. ముఖ్యంగా కన్నడ భాషలో మాట్లాడాలని కస్టమర్ కోరగా.. ఆమె అందుకు అంగీకరించలేదు. తాను ఇంగ్లీషులోనే మాట్లాడతానని హిందీ, కన్నడలో చర్చించనని తేల్చి చెప్పింది. ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ వ్యాఖ్యానించింది. ఇది కర్ణాటక కాబట్టి కన్నడనే మాట్లాడాలని కస్టమర్ చెప్పగా.. ఇది ఇండియా నాకు నచ్చిన భాషలో మాట్లాడతానంటూ మేనేజర్ దురుసుగా సమాధానం చెప్పారు. ఇలా వీరిద్దరి మధ్య తీవ్ర వివాదం సాగగా.. అక్కడే ఉన్న కొందరు దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా సదరు మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగులు అన్ని ప్రాంతాల్లో కస్టమర్లతో ఇలాగే వ్యవహరిస్తారంటూ పేర్కొనగా.. స్పందించిన ఎస్‌బీఐ అధికారినిని బదిలీ చేసింది.


కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు, కస్టమర్‌తో మాట్లాడిన విధానం చూసి.. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భాషా సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కన్నడ భాషపై బ్యాంక్ మేనేజర్ తీరును వ్యతిరేకిస్తూ.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు కర్ణాటక రక్షణ వేదికే సంఘం ప్రకటించింది. ఎస్‌బీఐ ఉద్యోగులు కస్టమర్లను పదే పేద అవమానిస్తున్నారని.. స్థానిక భాషలోనే ప్రాథమిక సేవలను అందించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించింది. అయితే తాజాగా ఈ వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.


బ్యాంక్ మేనేజర్ పౌరులతో ప్రవర్తించిన తీరు సైరనది కాదని చెప్పారు. అలాగే స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులు అందరూ గౌరవించాలని.. కస్టమర్లను గౌరవిస్తూ స్థానిక భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే సూర్య నగరలో కన్నడ మాట్లాడడానికి నిరాకరించిన ఎస్‌బీఐ మేనేజర్‌ను ఆ సంస్థ బదిలీ చేసిందని తెలిపారు. ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగిందని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి ఆయా ప్రాంతాల సంస్కృతి, భాష వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగాన్ని కోరారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటివి జరిగితే.. ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa