ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షం వరకూ అమెరికా రక్షణ కవచం గోల్డెన్ డోమ్

international |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 07:37 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా భద్రత కోసం గోల్డెన్ డోమ్ పేరుతో ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. భూమి నుంచి అంతరిక్షం వరకు వ్యాపించే ఉండే ఈ గోల్డెన్ డోమ్ కొత్త తరం క్షిపణి నిరోధక వ్యవస్థ అని.. అమెరికాతోపాటు అవసరమైతే కెనడాకూ రక్షణ కల్పించనుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సైనిక శక్తిని మరింత శక్తివంతం చేయనుందని తెలిపారు. ఈ గోల్డెన్ డోమ్‌ నిర్మాణం కోసం 175 బిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో రూ. 1.50 లక్షల కోట్లు) ఖర్చుచేయనున్నట్టు ట్రంప్ చెప్పారు. భూమి, సముద్రం, అంతరిక్షంలో ముందున్న ప్రమాదాల నుంచి అమెరికాను రక్షించే అత్యాధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు.


‘ఇజ్రాయేల్‌కు ‘ఐరన్ డోమ్’ ఉంది... మరి అమెరికాకు ఎందుకు ఉండకూడదు? ఇది చాలా ప్రమాదకరమైన ప్రపంచం.. మన పౌరులను మేము గట్టిగా కాపాడతాం.. 2029 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. క్షిపణి రక్షణ వ్యవస్థలు బూస్ట్, మిడ్‌కోర్స్, టర్మినల్ అనే మూడు స్థాయిల్లో పనిచేస్తాయి. అవి లక్ష్యాన్ని తాకక ముందే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేస్తాయి. ఇటీవల పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణులను భారత్ ఎస్-400 వ్యవస్థ, ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది.


క్షిపణి నిరోధక వ్యవస్థలు


ఇవి ప్రధానంగా పరస్పర అనుసంధానమైన, బహుళస్థాయి వ్యవస్థలు — శత్రువు క్షిపణులను ప్రయోగించిన దశ నుంచి లక్ష్యాన్ని తాకే దశ వరకు (బూస్ట్, మిడ్‌కోర్స్, టర్మినల్) గుర్తించడం, ట్రాక్ చేయడం, నాశనం చేయడం. లక్ష్యం చాలా సూటిగా ఉంటుంది. క్షిపణి లక్ష్యాన్ని తాకేలోపు దాన్ని కూల్చివేయడం.


ఇజ్రాయేల్ ‘ఐరన్ డోమ్’


2011 నుంచి సేవల్లో ఉన్న ఈ వ్యవస్థ సక్సెస్ రేటు 95 శాతంగా ఉంది. ఇందులోని ప్రతీ బ్యాటరీలో రాడార్, ట్రాజెక్టరీ కంప్యూటర్, లాంచర్ ఉంటాయి. దీని బయటి పొరల్లో డేవిడ్స్ స్లింగ్, ఆరో-2, ఆరో-3 వ్యవస్థలు ఉన్నాయి. 2011లో ప్రారంభమైనప్పటి నుంచి వేల కొద్ది క్షిపణులను, రాకెట్లను అడ్డుకుంది. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ ప్రయోగించిన 100కుపైగా క్షిపణుల్లో ఎక్కువ శాతాన్ని అడ్డుకుని ఈ వ్యవస్థ ప్రాముఖ్యతను మరింత స్పష్టం చేసింది. టెల్అ‌వీవ్‌పై ప్రయోగించిన క్షిపణులను అడ్డుకుంది.


హమాస్ అక్టోబర్ 7న జరిపిన దాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైన సైనిక ఘర్షణ సమయంలో ఈ వ్యవస్థలు హమాస్ ప్రయోగించిన అనేక రాకెట్లను అడ్డుకున్నాయి. అయితే, హమాస్ కేవలం 20 నిమిషాల్లో 5,000 క్షిపణులను ప్రయోగించగా, వాటిలో కొన్ని ఐరన్ డోమ్ వ్యవస్థను దాటి వెళ్లాయి. ఈ సందర్భంలో రక్షణ వ్యవస్థలు పూర్తి వినియోగ దశ (saturation) చేరుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఈ రక్షణ కవచం వేల కొద్దీ ప్రాణాలను రక్షించిందన్నది ఎప్పటికీ స్పష్టమైన వాస్తవం.


భారత్‌ను రక్షించిన ఆకాశ్


ఇప్పుడు భారత్ విషయానికొస్తే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ నుంచి వచ్చిన వందలాది డ్రోన్లు, క్షిపణులు భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై దాడికి యత్నించాయి. ఈ సందర్భంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన "ఆకాశ్" క్షిపణి వ్యవస్థ భారత సమగ్ర వాయు రక్షణ వ్యవస్థ (Integrated Air Defence Network) దేశాన్ని విజయవంతంగా రక్షించింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ. పీఈచోరా, ఓఎస్ఏ-ఏకే లాంటి షార్ట్ రేంజ్ వ్యవస్థలతో మొదలు..ఆకాష్, MRSAM లాంటి మీడియం రేంజ్ వ్యవస్థలు.. ఎస్-400 వంటి దీర్ఘశ్రేణి ఆధునిక వ్యవస్థలు ఉ్నాయి.


అమెరికా 'గోల్డెన్ డోమ్'లో భాగాలు:


స్పేస్ బేస్డ్ ఇన్‌ఫ్రాడ్ సిస్టమ్ (SBIRS-Space-Based Infrared System): ఉపగ్రహాల ద్వారా శత్రువు ప్రయోగించిన క్షిపణుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకునే వ్యవస్థ.


గ్రౌండ్ బేస్ట్ మిడ్‌కోర్స్ డిఫెన్స్ (GMD-Ground-Based Midcourse Defense): అలాస్కా, కాలిఫోర్నియాల్లో మిడ్‌కోర్స్ దశలో క్షిపణులను ఢీకొట్టే వ్యవస్థ.


ఏగిస్ బీఎండీ ( Aegis BMD): సముద్రంలో ఉండే యుద్ధ నౌకలపై అమర్చే వ్యవస్థ, షార్ట్-టు-ఇంటర్మీడియట్ శ్రేణి క్షిపణులకు ప్రాధాన్యత.


థాఢ్ (THAAD): టెర్మినల్ దశలో రక్షణనిచ్చే మానవరహిత వ్యవస్థ, హౌతీలు ఇజ్రాయేల్‌పై ప్రయోగించిన క్షిపణిని కూడా ఇది అడ్డుకుంది.


ప్యాక్ (PAC-3): షార్ట్ రేంజ్ భద్రతకు ఉపయోగపడే వ్యవస్థ, ఇది చైనా హైపర్‌సోనిక్ ఆయుధాలను పసిఫిక్ ప్రాంతంలో ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉంది.


ఇతర దేశాలు:


రష్యా: మాస్కోను రక్షించే A-135, S-400 వ్యవస్థలు, చైనా వద్ద HQ-9తో పాటు ఉపరితలం నుంచి గాల్లోకి.. యాంటి-బాలిస్టిక్ సామర్థ్య వ్యవస్థ, దీర్ఘశ్రేణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. హెచ్‌క్యూ 9 వ్యవస్థను పాకిస్తాన్‌కు కూడా అందజేసింది. భారత్ ఆపరేషన్ సిందూర్ సమయంలో దీనిని జామ్ చేసి పాక్ భూభాగంలో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. జపాన్, తైవాన్ వద్ద కూడా ఇలాంటి వాయు రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి, ప్రపంచం భవిష్యత్తులో మరింత అణుశక్తి, హైపర్‌సోనిక్ ఆయుధాల వ్యూహాత్మక పోటీకి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘గోల్డెన్ డోమ్’ అమెరికాకు సాంకేతిక పరంగా కీలక ముందడుగు కావచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa