ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో కీలక సమావేశాల అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 06:47 AM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్రమంత్రులతో కీలక సమావేశాల అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో, అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీ సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైకాపా హయాంలో జరిగిన నష్టం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ దిశగా అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం సుమారు రూ.1.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించగలిగామని ఆయన వెల్లడించారు.రాష్ట్రంలో ఇంధన రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు సీఎం తెలిపారు. 'పీఎం సూర్యఘర్‌' పథకం కింద రాష్ట్రంలోని 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందించాలనేది తమ ఆకాంక్ష అని, ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలకు విద్యుత్ సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. సూర్యఘర్‌ పథకం అమలుకు కేంద్రం పూర్తి మద్దతు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం 'ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ'ని తీసుకొచ్చిందని, ఈ విధానం ద్వారా 72 గిగావాట్ల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. ఇందుకు అవసరమైన రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను మంజూరు చేయాలని కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీని అభ్యర్థించగా, ఆయన సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. కుసుమ్‌ పథకం కింద 2 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, ఏపీ త్వరలో గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గ్రీన్‌ ఎనర్జీ ద్వారా రాష్ట్రంలో 24 గంటలూ నిరంతర విద్యుత్‌ సరఫరా సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ ఫలప్రదంగా జరిగిందని చంద్రబాబు తెలిపారు. "ఆపరేషన్‌ సిందూర్‌"ను విజయవంతంగా పూర్తి చేసినందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌కు అభినందనలు తెలియజేశానన్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు పలు క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్‌లో అందుబాటులో ఉన్న 6వేల ఎకరాల్లో మిసైల్‌ అండ్‌ అమ్యూనేషన్‌ ప్రొటెక్షన్‌ కేంద్రాన్ని, లేపాక్షి-మడకశిర క్లస్టర్‌లో మిలిటరీ, సివిల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, ఎలక్ట్రానిక్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే, విశాఖ- అనకాపల్లి క్లస్టర్‌లో నేవల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ కేంద్రాలు, కర్నూలు- ఓర్వకల్లు క్లస్టర్‌లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్‌, అడ్వాన్స్‌ డిఫెన్స్‌ కాంపోనెంట్స్‌ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయాలని కోరగా, ఈ ప్రతిపాదనలన్నింటికీ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు.పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించవచ్చని, సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని, అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa