ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్ద పేగుని క్లీన్ చేసి మలబద్ధకాన్ని పోగొట్టే వ్యాయామాలు

Life style |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 11:38 PM

మలబద్ధకం అనేది చెప్పుకోలేని సమస్య. అందుకే చాలా మంది ఏం చేయాలో తెలియక మొహమాటంతో అలాగే ఉండిపోతారు. ఏదో సాధారణంగా మొదలయ్యే ఈ ఇబ్బంది రానురాను మరీ తీవ్రమైపోతుంది. ఈ కారణంగా ఉదర సంబంధిత జబ్బులన్నీ వస్తాయి. దీంతో పాటు రకరకాల అనారోగ్యాలు వెంటాడతాయి. శరీరంలో ఉన్న మలినాలు సరైన విధంగా బయటకు వెళ్తేనే బాడీ ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. అయితే.. మలబద్ధకం పోగొట్టుకోడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.


కేవలం ఆహార పదార్థాలతోనే కాదు. కొన్ని రకాల వ్యాయామాలతోనూ ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. యోగా ట్రైనర్ చెప్పిన యోగాసనాలు రెగ్యులర్ ట్రై చేస్తే త్వరలోనే పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అంతే కాదు. పెద్ద పేగు మొత్తం క్లీన్ అయిపోతుంది. క్రమంగా మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. ఆ ఆసనాలు ఏంటి. ఎంత సేపు చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.


గోరు వెచ్చని నీళ్లు


మలబద్ధకానికి ముఖ్య కారణం పేగుల్లో కదలిక లేకపోవడం. తిన్న ఆహారం అంతా పేగుల్లో గట్టిగా మారిపోతుంది. సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణ వ్యవస్థ పని తీరుపై ప్రభావం పడుతుంది. అలాంటప్పుడు పేగుల్లో కాస్త కదలిక తీసుకురావడం ముఖ్యం. అలా జరగాలంటే గోరు వెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. వేడి నీళ్లు తాగితే పేగుల్లో కాస్త చలనం వస్తుంది. అప్పుడు సులువుగా మురికి అంతా బయటకు వచ్చేస్తుంది. రోజూ ఉదయమే పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు చూడొచ్చు. అయితే..యోగా ట్రైనర్ మాత్రం ఈ గోరు వెచ్చని నీళ్లను తాగడానికి కూడా ఓ పద్ధతి ఉందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగా యోగాసనంలో ఉండి నీళ్లు తాగితే ఫలితాలు ఇంకా త్వరగా వచ్చే అవకాశముంది.


ఎలా తాగాలంటే


కనీసం రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగితే మలవిసర్జన సాఫీగా జరిగిపోతుంది. అయితే..ఇలా తాగినప్పుడు కూర్చోవడం, నిలుచోవడం కాకుండా ఓ ఆసనం వేయాలి. యోగా ట్రైనర్ చెప్పినట్టుగా మలాసనంలో కూర్చుని నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల పేగుల్లో కదలిక రావడంతో పాటు సులువుగా మురికి అంతా బయటకు వచ్చేందుకు వీలవుతుంది. మలాసనం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కడుపు ఉబ్బరంతో పాటు పొట్టలో వచ్చే అనేక సమస్యలకు ఈ ఆసనం బాగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఇలా మలాసనం వేయడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.


తాడాసనం


యోగాలో తాడాసనానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శరీరంలోని ప్రతి కండరం కదులుతుంది. అంతే కాదు. బాడీకి ఎనర్జీ ఇస్తుంది ఈ ఆసనం. మెదడు చురుగ్గా పని చేసేందుకూ తోడ్పడుతుంది. రెగ్యులర్ గా ఈ ఆసనం సాధన చేస్తే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. అయితే..మలబద్ధకం పోవాలన్నా, పెద్ద పేగు మొత్తం క్లీన్ అయిపోవాలన్నా తాడాసనం బాగా పని చేస్తుంది. ఈ ఆసనం వేయాలంటే ముందుగా నిటారుగా నిలబడాలి. ఆ తరవాత కాళ్లు కొద్దిగా పైకి లేపాలి. పాదాలు నేలకు ఆనకుండా ఉండాలి. చేతులు కూడా పూర్తిగా పైకి ఉంచాలి. ఇలా అటూ ఇటూ నడవాలి. అయితే కనీసం ఓ నిముషం పాటు ఇలా చేస్తే మలబద్ధకం సమస్య తీరిపోతుంది.


యోగా ట్రైనర్ చెప్పిన వ్యాయామాలు


వెన్నెముక వ్యాయామం


బాత్ రూమ్ లో ఎక్కువ సమయం పాటు ఉంటూ మల విసర్జనకు ఇబ్బంది పడుతుంటారు. ఈ చికాకు తగ్గిపోవాలంటే స్పైన్ ట్విస్టింగ్ అనే వ్యాయామం చేయాలంటున్నారు యోగా ట్రైనర్. ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ వ్యాయమం చేయాలి. ఇది కూడా కనీసం ఓ నిముషం పాటు చేయాలి. ఇలా చేస్తే పేగుల్లో కదలికలు వస్తాయి. సాఫీగా మల విసర్జన జరిగేందుకు అవకాశముంటుంది. ఎక్కువ సేపు బాత్ రూమ్ లో కూర్చుని ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ వ్యాయామం రోజూ చేయాలి.


సైడ్ బెండింగ్


సైడ్ బెండింగ్ అనే వ్యాయామమూ మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. యోగా ట్రైనర్ చెప్పినట్టుగా ఈ ఎక్సర్ సైజ్ చేయాలి. రెండు చేతులూ పైకి ఎత్తి నడుముని రెండు వైపులా వంచుతూ ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం 20 సార్లు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మలవిసర్జన జరుగుతుంది. దీంతో పాటు క్రో వాక్ కూడా చేయాలి. అంటే కాకిలా నడవడం. సింపుల్ గా చెప్పాలంటే మోకాళ్లపై నడవడం. పూర్తిగా నేలకు మోకాళ్లు ఆనించకుండా వాకింగ్ చేయాలి. ఇలా కనీసం 30 సెకన్ల పాటు చేసినా సరిపోతుంది. ఈ వ్యాయామలతో పేగుల్లో ఉన్న మలినంతా క్లీన్ అయిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com