దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని థానేలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా సోకిన 21 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మృతుడు తీవ్రమైన డయాబెటిస్‌తో కూడా బాధపడుతున్నాడని, ఇదే పరిస్థితిని మరింత విషమంగా మార్చిందని తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం, సదరు యువకుడు గురువారం నాడు తీవ్రమైన డయాబెటిస్ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. అనంతరం అతనికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే, కరోనా మరియు డయాబెటిస్ సమస్యలతో పోరాడుతూ చికిత్స పొందుతున్న ఆ యువకుడు మృతి చెందాడు.థానే ప్రాంతంలో ప్రస్తుతం 18 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరిలో 17 మంది తమ ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుండగా, ఒకరు మాత్రం ఆసుపత్రిలో చేరాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సమయంలో అతను మరణించినట్లు పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఆస్పత్రిలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షా సదుపాయాలను అందుబాటులో ఉంచామని, అలాగే 19 పడకలతో ఒక ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశామని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
![]() |
![]() |