పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ బలోచ్ జర్నలిస్టు అబ్దుల్ లతీఫ్ బలోచ్‌ను ప్రభుత్వ మద్దతున్న ముఠాలు అత్యంత పాశవికంగా హత్య చేశాయి. అవరన్ జిల్లాలోని మష్కేయ్ పట్టణంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగులు, భార్యాపిల్లల కళ్లెదుటే అబ్దుల్ లతీఫ్‌ను కాల్చి చంపారని వార్తా సంస్థలు తెలిపాయి.నిజాలను నిర్భయంగా వెలికితీసే జర్నలిస్టుగా పేరుపొందిన అబ్దుల్ లతీఫ్, బలోచ్ ప్రజల బాధలను, వారి పోరాటాలను తన కథనాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. సత్యం మాట్లాడితే తూటాలే సమాధానమయ్యే ఆ ప్రాంతంలో, ఆయన నివేదికలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. ఈ హత్య పాకిస్థాన్ అనుసరిస్తున్న "కిల్ అండ్ డంప్" విధానంలో భాగమేనని, బలోచ్ అస్తిత్వాన్ని దెబ్బతీసి, వ్యతిరేక గళాలను అణచివేసే కుట్రలో భాగమేనని నిపుణులు ఆరోపిస్తున్నారు.కొన్ని నెలల క్రితమే అబ్దుల్ లతీఫ్ కుమారుడు సైఫ్ బలోచ్‌తో పాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులను భద్రతా దళాలు బలవంతంగా అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత హత్య చేశాయని సమాచారం. ఇది కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు నిదర్శనమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలి కాలంలో బలోచిస్థాన్‌లో బలవంతపు అదృశ్యాలు, లక్షిత హత్యలు తీవ్రమయ్యాయి. మే 17న యూనుస్ రసూల్ అనే వ్యక్తిని పాక్ సైనిక దళాలు అర్ధరాత్రి అపహరించుకుపోయి, చిత్రహింసలకు గురిచేసి చంపేశాయి. ఆయన మృతదేహం మరుసటి రోజు లభ్యమైంది. అలాగే, అవరన్ జిల్లాకే చెందిన సాజిద్ బలోచ్ అనే యువకుడిని కూడా ఇదే రీతిలో అపహరించి, హింసించి చంపి రోడ్డు పక్కన పడేశారు."ఇవి విడిగా జరుగుతున్న ఘటనలు కావు. పాకిస్థాన్ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా అణచివేత విధానాన్ని అవలంబిస్తోంది. భద్రత పేరుతో బలోచ్ ప్రజల జీవితాలను కాలరాస్తున్నారు," అని ఓ బలోచ్ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. బలోచ్ యక్జేహతీ కమిటీ ఈ దారుణాలపై తక్షణమే స్పందించాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ మీడియా సంస్థలను, పత్రికా స్వేచ్ఛా సంఘాలను కోరింది. బలోచిస్థాన్‌లో పౌరులు, విద్యార్థులు, కార్మికులు, కార్యకర్తలు, పిల్లల ప్రాణాలకు ప్రభుత్వ ఉగ్రవాదం నుంచి తక్షణ ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
![]() |
![]() |