ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లండన్‌ రైలులో భోజనం చేసిన మహిళ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై చర్చ

international |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 08:07 PM

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానంలో ప్రతీ ఒక్కరు లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు చాలా వేగంగా పనులు చేస్తున్నారు. ఇక ఒకే సమయంలో రెండు మూడు పనులు చేసినా.. సమయం సరిపోవడం లేదు. అందుకే తెల్లవారుజామున లేచి.. ఇంట్లో పనులు చేసుకుని మళ్లీ ఆఫీసుకు వెళ్లి.. సాయంత్రం తిరిగి వచ్చి మళ్లీ ఇంట్లో పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి ఆఫీసు, కాలేజీకి వెళ్లే ప్రయాణాల్లోనే టిఫిన్లు, స్నాక్స్ కానిచ్చేస్తు్న్నారు. ఇలా బస్సుల్లో, రైళ్లల్లో భోజనాలు చేస్తూ.. మనకు నిత్యం చాలా మంది కనిపిస్తూనే ఉంటారు. అయితే తాజాగా లండన్‌లో ఒక భారతీయ మహిళ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో ప్రయాణిస్తున్న ఆ ఇండియన్ మహిళ.. ప్లేటులో తాపీగా భోజనం చేస్తున్న వీడియో వైరల్ కావడంతో భారత సంస్కృతిపై చర్చ జరుగుతోంది.


అయితే మన దేశంలో ఇలా ప్రయాణాల్లో భోజనం చేయడం సర్వసాధారణమే. కేవలం ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతిలో స్నేహానికి, ఆతిథ్యానికి గుర్తుగా కూడా భావిస్తారు. కానీ.. వెస్టర్న్ దేశాల్లో ఇలా బస్సులు, రైళ్లల్లో భోజనం చేస్తే చాలా విచిత్రంగా, విడ్డూరంగా చూస్తారు. అయితే పరిశుభ్రత, ప్రైవేట్ స్పేస్, ఇతరులకు గౌరవం వంటి వాటిని విదేశాల్లో చూస్తారు. ఇలాంటి తరుణంలో లండన్‌ మెట్రో రైలులో ఒక భారతీయ మహిళ.. స్పూన్‌తో కాకుండా డైరెక్ట్ తన చేతులతోనే భోజనం చేస్తూ ఉండడాన్ని తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ భారతీయ మహిళ.. కుడి చేత్తో భోజనం చేస్తూనే.. ఎడమ చేతితో ఫోన్‌ పట్టుకుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది.


వైరల్ వీడియోలో ఏముంది?


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. రద్దీగా ఉన్న మెట్రో రైలులో ఒక మహిళ సీటులో కూర్చుని ఉంది. ఆమె తన కాళ్లపై ప్లేటు పెట్టుకుని కుడి చేత్తో అన్నం తింటూ, ఎడమ చేతితో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. అయితే ఈ వీడియోను సాధారణ ఘటనగా కాకుండా.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం ఎలా ప్రవర్తించాలి, వ్యక్తిగత స్వేచ్ఛకు, ఇతరుల హక్కులకు మధ్య సరిహద్దులు ఏవి అనే కీలక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


అయితే ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆ మహిళ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపడుతుండగా.. మరికొందరు మద్దతుగా నిలిచారు. ఇలా ప్రజా రవాణాలో భోజనం చేయడం వల్ల ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని.. భోజనం నుంచి వచ్చే ఘాటైన వాసనల వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలాంటివి చేయడం వల్ల అశుభ్రతకు కారణం అవుతాయని మరికొందరు ఆమె ప్రవర్తనపై విమర్శలు చేశారు.


కానీ మరికొందరు నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. చేతులతో భోజనం చేయడం అనేది భారతీయ సంస్కృతిలో చాలా సాధారణమైన పద్ధతి అని పేర్కొన్నారు. బర్గర్, శాండ్‌విచ్‌లు తినవచ్చు కానీ.. అన్నం తినడమే తప్పా అంటూ ఆమెకు మద్దతుగా ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, సంస్కృతుల గౌరవం ముఖ్యమని.. అయితే ఆ మహిళ ఎవరికీ నష్టం చేయలేదని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనను కేవలం సాధారణంగానే చూడకుండా.. భారతీయ సంస్కృతి ఎంత విస్తృతమైనదో.. అంతర్జాతీయ వేదికలపై మన ప్రవర్తనకు ఉన్న ప్రాధాన్యత ఏంటో గుర్తుచేసే సంఘటనగా నిలిచిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో వివిధ సంస్కృతుల మధ్య అవగాహన.. సహనం ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి చాటిచెప్పిందని చెబుతున్నారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa