ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ను టార్గెట్ చేసుకునేవారికి వెంటనే గుడ్ బై చెప్పేయండి..: కెనడా మాజీ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 07:55 PM

భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులతో వెంటనే సంబంధాలు తెంచుకోవాలని రాజకీయ పార్టీలకు ఆదేశ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ సూచించారు. దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏ పార్టీ అయినా సరే ఇండియాతో సమస్యలు సృష్టించిన వేర్పాటువాదులతో సంబంధాలు తెంచుకోవాల్సిందేనని అన్నారు. లేకపోతే కెనడా ఎప్పటికీ.. న్యూఢిల్లీతో స్నేహ పూర్వకమైన, సత్సంబంధాలను కొనసాగించలేదని చెప్పారు. ముఖ్యంగా ఇండియాను విభజించాలని చూసే ఎలాంటి శక్తులకు అయినా సరే ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు.


భారత దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులతో రాజకీయ పార్టీలకు ఉన్న అనుబంధాన్ని వెంటనే తెంచేసుకోవాలని కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ స్పష్టం చేశారు. ఖలిస్థానీ వాదుల మద్దతుతో కెనడాలో పరోక్షంగా భారత వ్యతిరేక శక్తులు బలపడుతున్నాయని హెచ్చరించారు. గత వారాంతంలో బ్రాంప్టన్‌లో జరిగిన ‘కెనడా–ఇండియా చారిటీ గాలా’ కార్యక్రమంలో గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు అందుకుంటూ.. హార్పర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం మా కీలక మిత్ర దేశం అని చెప్పుకొచ్చారు. ఆ సంబంధాన్ని ఎప్పటికీ కొనసాగించాలంటే.. రాజకీయ పార్టీలన్నీ భారత్‌ను విభజించాలని చూసే వేర్పాటువాదులకు దూరంగా ఉండాలన్నారు.


 ఖలిస్థాన్ వాదులు కెనడాలోని చిన్న వర్గమేనిని.. అయినప్పటికీ వారితో సంబంధాలు తెంచుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు ఆలస్యం చస్తున్నాయో తనకు తెలియడం లేదన్నారు. తన పదవీ కాలంలో ఖలిస్థాన్ వాదులతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని ప్రభుత్వాన్ని నడిపించినట్లు గుర్తు చేశారు. అయితే ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా అదే విధానాన్ని పాటిస్తాయని తాను భావిస్తున్నట్లు హార్పర్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా కెనడాకు మిత్ర దేశంగా ఉన్న భారత్‌తో తిరిగి బలమైన సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకుంటే.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.


అంతేకాకుండా జిహాదీలు, యాంటీ సెమిట్‌లు, ఖలిస్థానీలు వంటి విభజన సమూహాలను ప్రోత్సహించడం ఆపాలని చెప్పారు. ఇవి మాత్రమే ఇండియా-కెనడాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్నో ఏళ్లుగా స్నేహ పూర్వకంగా ఉన్న భారత్-కెనడా దేశాల మధ్య 2013లో విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా అప్పుడు అధికారంలో ఉన్న ట్రూడో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ ఆరోపించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇండియా దీన్నీ తీవ్రంగా ఖండించింది.


ఆ తర్వాత కూడా.. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటుందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వ్యాఖ్యానించగా.. ఈ గొడవ మరింత పెద్దది అయింది. ఇలా రెండు దేశాల మధ్య చాలా కాలంగా సంబంధాలు సాగడం లేదు. అయితే ఇటీవలే ఆ దేశంలో ఎన్నికలు జరగ్గా.. మార్క్ కార్నీ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa