ట్రెండింగ్
Epaper    English    தமிழ்

29 ఏళ్ల వయసులోనే అనూహ్య నిర్ణయం తీసుకున్న పూరన్

sports |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 10:10 AM

క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం 29 ఏళ్ల వయసులోనే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను, క్రీడా విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్న‌ ఈ ట్రినిడాడ్ ఆటగాడు తన నిర్ణయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడించాడు. దీంతో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో వెస్టిండీస్‌కు 167 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన ఆయన కెరీర్‌కు తెరపడింది.తన కెరీర్‌లో వన్డే ఫార్మాట్‌లో 61 మ్యాచ్‌లు ఆడి 39.66 సగటు, 99.15 స్ట్రైక్ రేట్‌తో 1,983 పరుగులు సాధించాడు. ఇక టీ20 ఇంటర్నేషనల్స్‌లో వెస్టిండీస్ తరఫున అత్యధికంగా 2,275 పరుగులు చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో ఆయన స్ట్రైక్ రేట్ 136.39గా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో క‌రేబియ‌న్ జ‌ట్టు త‌ర‌ఫున 106 మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. చాలా ఆలోచన, సమీక్ష తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. మనం ప్రేమించే ఈ ఆట మనకు ఎంతో ఇచ్చింది.. ఇస్తూనే ఉంటుంది. ఆనందం, లక్ష్యం, మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం" అని పూరన్ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొన్నాడు.ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2016లో పాకిస్థాన్‌పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంతకు రెండేళ్ల ముందు 2014లో అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో వన్డే అరంగేట్రం చేసిన పూరన్ 2019 క్రికెట్ ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.అత‌ని నాయకత్వ లక్షణాలను గుర్తించి 2021 టీ20 ప్రపంచకప్‌కు వైస్-కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. ఆ తర్వాత 2022లో ఆరు నెలల పాటు రెండు వైట్-బాల్ ఫార్మాట్లలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. "కెప్టెన్‌గా జట్టును నడిపించడం అనేది నేను ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకునే గౌరవం" అని పూర‌న్ ఈ సంద‌ర్భంగా గుర్తుచేసుకున్నాడు.క్రికెట్ వెస్టిండీస్  కూడా పూరన్ సేవలను కొనియాడుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రపంచ స్థాయి ఆటగాడు, గేమ్ ఛేంజర్ అయిన నికోలస్ పూర‌న్‌ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 106 మ్యాచ్‌లతో అత్యధిక గేమ్‌లు ఆడిన వెస్టిండీస్ ఆటగాడిగా, 2,275 పరుగులతో అత్య‌ధిక ర‌న్స్‌ స్కోరర్‌గా నిష్క్రమిస్తున్నాడు. మైదానంలో అతని ప్రదర్శనలు, జట్టులో అతని ప్రభావం వెస్టిండీస్ క్రికెట్‌పై శాశ్వత ముద్ర వేశాయి" అని సీడబ్ల్యూఐ పేర్కొంది.వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు కేవలం ఎనిమిది నెలల సమయం ఉండగా పూరన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2024లో ఆయన చివరిసారిగా వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.తన ఆకస్మిక రిటైర్మెంట్‌కు గల కారణాలను పూరన్ స్పష్టంగా వెల్లడించనప్పటికీ, ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఆటగాళ్లు ఎక్కువగా దృష్టి సారిస్తున్న ప్రస్తుత ధోరణిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, "వెస్టిండీస్ క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో జట్టుకు, ఈ ప్రాంతానికి విజయం, బలం చేకూరాలని కోరుకుంటున్నాను" అని పూరన్ తన వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa