భారత్‌తో పాటు ప్రంపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఇది వాణిజ్యపరంగా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లకు పోటీగా నిలుస్తోంది. ఈ లీగ్‌లో జరిగే మూడు గంటల మ్యాచ్‌లు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటివరకు ఐపీఎల్ 18 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల ముగిసిన 18వ సీజన్‌లో తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ గెలిచింది.
అయితే ఈ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 18 ఏళ్లుగా ఒక్కసారి టైటిల్ గెలవకున్నా ప్రజాదరణలో మాత్రం ఎక్కడా తక్కలేదు ఆర్సీబీ. ఈ ఫ్రాంచైజీకి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలు ఆడారు. అయితే ఇంత పాపులర్ ఫ్రాంచైజీని అమ్మేందుకు యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ్రాంచైజీని విక్రయించే అవకాశాలను ఆర్సీబీ యాజమాన్యం డయాజియో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీని జట్టును పూర్తిగా లేదా ఫ్రాంచైజీలో కొంత భాగాన్ని విక్రయించేందుకు డయాజియో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏంత మేర విక్రయించాలనే విషయంపై సలహాదారులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. జట్టు విలువ 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. ఫ్రాంచైజీని విక్రయించకూడదని కూడా నిర్ణయించుకునే అవకాశం సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
డయాజియో తన భారతీయ సబ్సిడరీ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ద్వారా ఆర్సీబీ ఫ్రాంచైజీని నిర్వహిస్తోంది. అయితే ఐపీఎల్‌లో పొగాకు, మద్యం బ్రాండ్ల ప్రమోషన్‌ను నిషేధించాలని.. అందులో భాగంగా క్రీడా ప్రముఖుల ద్వారా ఇతర అనారోగ్యకరమైన ఉత్పత్తుల పరోక్ష ప్రమోషన్‌ను ఆపాలని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో డయాజియో.. ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రాడవం గమనార్హం. భారత్‌లో టొబాకో, మద్యం ఉత్పత్తుల ప్రత్యక్ష ప్రకటనలను నిషేధించారు. డయాజియో వంటి సంస్థలు అగ్రశ్రేణి క్రికెటర్ల ద్వారా సోడా, మ్యూజిక్ సీడీలు వంటి పేర్లతో ఇతర ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాయి.
డయాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల మందగమనం కారణంగా ప్రీమియం మద్యం అమ్మకాలు తగ్గాయి. దీంతో ఆ సంస్థ.. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తోంది. ఈ క్రమంలోనే నాన్-కోర్ అసెట్‌లను అమ్మేందుకు ఆలోచిస్తోంది. ఇప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తే.. ఆ కంపెనీకి మూలధనం సమకూరుతుంది.
ఐపీఎల్ వ్యవస్థాపక జట్లలో ఆర్సీబీ ఒకటి. దీన్ని మొదట విజయ్ మాల్యా సొంతం చేసుకున్నారు. ఆయన కంపెనీ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. 2012లో బ్యాంకులకు రుణం చెల్లించలేక మూతపడింది. దీంతో విజయ్ మాల్యా స్పిరిట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా.. డయాజియో ఆర్సీబీని స్వాధీనం చేసుకుంది. మరోవైపు, ప్రతి ఏడాది ఐపీఎల్ విలువ పెరుగుతూ పోతోంది. దీంతో ఆర్సీబీ జట్టు స్పోర్ట్స్‌లో అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా మారింది. ఒకవేళ డయాజియో ఆర్సీబీని అమ్మేస్తే.. ఈ డీల్ భవిష్యత్తులో జరిగే ఒప్పందాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది. ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa