భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ సురక్షిత స్థావరంగా మారిందని, ఒసామా బిన్ లాడెన్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాది సైనిక నగరంలో ఏళ్ల తరబడి ఎలా ఉండగలిగాడని ఆయన ప్రశ్నించారు. ఐరోపా పర్యటనలో భాగంగా బ్రస్సెల్స్‌లో ‘యూరాక్టివ్’ అనే వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైశంకర్ పలు కీలక అంశాలపై భారత వైఖరిని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల మీడియా భారత్-పాక్ సంబంధిత విషయాల్లో అనుసరిస్తున్న తీరును కూడా ఆయన తప్పుపట్టారు.ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ వైఖరిని ఎండగడుతూ, "ఒసామా బిన్ లాడెన్ అనే వ్యక్తి గురించి మీ అందరికీ తెలుసు. అతను పాకిస్థాన్‌లోని ఒక సైనిక నగరంలో సంవత్సరాల పాటు ఎలా నివసించగలిగాడు? ఈ విషయాన్ని ప్రపంచం లోతుగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఉగ్రవాదానికి సంబంధించిన అంశం. ఈ ఉగ్రవాదమే రేపు మిమ్మల్ని కూడా వెంటాడుతుంది" అని జైశంకర్ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వంటి విషయాలను కూడా పశ్చిమ దేశాల మీడియా కేవలం భారత్-పాక్ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు.రష్యాపై ఆంక్షలు, అంతర్జాతీయ సూత్రాల గురించి మాట్లాడుతున్న పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిని జైశంకర్ తూర్పారబట్టారు. "విభేదాలను యుద్ధాలు పరిష్కరిస్తాయని మేము నమ్మం. యుద్ధభూమి నుంచి పరిష్కారాలు వస్తాయని కూడా మేము భావించడం లేదు. అయితే, ఏం చేయాలో ఇతరులకు చెప్పడం మా పని కాదు, కానీ పరిష్కార ప్రక్రియలో మేం భాగస్వాములం అవుతాం" అని ఆయన స్పష్టం చేశారు."ప్రతి దేశం తమ అనుభవాలు, చరిత్ర, ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తటస్థ వైఖరి తీసుకోవాలి. భారత్ ఏర్పడిన తొలినాళ్లలో పాకిస్థాన్ ఆక్రమణదారులను పంపడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అప్పట్లో దీనికి పశ్చిమ దేశాలే పూర్తిగా మద్దతు పలికాయి. అలాంటి దేశాల్లో చాలా వరకు ఇప్పుడు అంతర్జాతీయ సూత్రాల గురించి గొప్పగా చర్చించాలనుకుంటున్నాయి. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను.. మీ గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోమని అడగడానికి మాకు సరైన కారణం ఉంది" అంటూ జైశంకర్ చురకలంటించారు.ఐరోపాలోని మారుతున్న భౌగోళిక రాజకీయాలపై మాట్లాడుతూ, "ఐరోపా తన సొంత ప్రయోజనాలు, సామర్థ్యం, ప్రపంచవ్యాప్త సంబంధాల ఆధారంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కేవలం మాటలకే పరిమితమైన వ్యూహాత్మక భాగస్వామ్యం వంటివి ఇప్పుడు ఐరోపాలో ఆచరణలోకి వస్తున్నాయని వింటున్నాను. బహుళ ధ్రువ ప్రపంచంలో మా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను" అని జైశంకర్ తెలిపారుఅమెరికాతో సంబంధాలు, మాజీ అధ్యక్షుడు ట్రంప్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "మా దేశ ప్రయోజనాలను కాపాడే ప్రతి సంబంధాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము. అమెరికా అత్యంత ముఖ్యమైన దేశం. అది ఏదో ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటం వలనో, మరో వ్యక్తి వలనో కాదు" అని ఆయన స్పష్టం చేశారు.పంపిణీ వ్యవస్థల్లో ఎదురయ్యే రిస్క్‌ను తగ్గించుకోవడానికి భారత్‌ను ఎంచుకుంటున్న అనేక ఐరోపా కంపెనీల ప్రతినిధులను తాను కలిశానని జైశంకర్ చెప్పారు. "చాలా కంపెనీలు తమ డేటా ఎక్కడ భద్రంగా ఉంటుందనే దానిపై చాలా అప్రమత్తంగా ఉన్నాయి. డేటాను కేవలం సామర్థ్యం ఉన్న చోటే కాకుండా, నమ్మకంగా, సురక్షితంగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలనుకుంటున్నాయి. మీరు సౌకర్యవంతంగా ఉండలేని వ్యక్తుల చేతిలో మీ డేటాను ఉంచాలనుకుంటారా?" అని ప్రశ్నిస్తూ, చైనా కంటే భారత్ ఎంతో నమ్మకమైన, సురక్షితమైన భాగస్వామి అని ఆయన పరోక్షంగా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa