పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే.. అది ‘విద్య’. జీవితాలను మార్చేసే ఆయుధం చదువే. అలాంటి చదువు.. పేదరికం కారణంగా ఏ పిల్లవాడికీ దూరం కాకూడదు. ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘తల్లికి వందనం’ పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీలలో ఈ పథకం ఒకటి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం, గత ప్రభుత్వ ‘అమ్మ ఒడి’ పథకం వివరాలు, వాటి మధ్య తేడాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
తల్లికి వందనం పథకం అంటే ఏమిటి?
పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి రూ.13,000 ఇవ్వగా.. పాఠశాల/ కాలేజీ నిర్వహణ (అభివృద్ధి)కి రూ.2000 కేటాయిస్తారు. విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు.
తల్లికి వందనం పథకం అర్హతలు:
దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి.
విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి.
విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు (పేదరిక రేఖకు దిగువన ఉండాలి).
ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు.
తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం:
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.15000 జమ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది.
గత ప్రభుత్వంలో ‘అమ్మ ఒడి’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. దాదాపుగా అమ్మ ఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాలను తల్లికి వందనం పథకానికి అనుసరిస్తున్నామని.. ఈ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యార్థికి ఇచ్చే 15 వేల రూపాయల్లో పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2000 కట్ చేస్తారు. ఇక కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం:
ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ విధానం అందుబాటులో లేదు. ఈ పథకం కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్‌సైట్, దాని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉంది.
తల్లికి వందనం పథకం ధరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు (తల్లి మరియు విద్యార్థి)
తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు
పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికెట్ (లేదా విద్యార్థి ప్రస్తుత పాఠశాల నుండి ధృవీకరణ)
ఆదాయ ధృవీకరణ పత్రం
అడ్రస్ ప్రూఫ్
విద్యార్థి హాజరు వివరాలు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు (విద్యార్థి మరియు తల్లి)
NPCI లింకింగ్ తప్పనిసరి..
తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే, విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడం (NPCI లింకింగ్) తప్పనిసరి. సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్‌ను లింక్ చేసుకునే అవకాశం ఉంది. మీ సేవా కేంద్రాల ద్వారానూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ లింకింగ్ అయ్యిందో, లేదో కూడా మీ సేవా కేంద్రాల ద్వారా చెక్ చేసుకోవచ్చు. NPCI అధికారిక వెబ్‌సైట్ https://www.npci.org.in ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.
బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు తేలిగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకం నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
దీంతో పాటు తల్లి, వారి పిల్లల వివరాలను హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో నమోదు చేయించుకోవాలి. హౌస్ హోల్డ్‌లో కూడా ఈకేవైసీ చేయాలి. విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్‌కు ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి.
తల్లికి వందనం పథకం
తల్లికి వందనం స్కీమ్ ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి ఆధారంగా అర్హత ప్రమాణాలను గుర్తిస్తారు.
కుటుంబం ఆర్థిక స్థితి, విద్యార్థి హాజరు శాతం లాంటి అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తారు.
తల్లికి వందనం 2025
వేసవి సెలవులు పూర్తై పాఠశాలలు పున:ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించి 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా ఇదే రోజుకు (12 జూన్ 2025) ఏడాది పూర్తవుతుండటం మరో విశేషం. తల్లికి వందనం పథకం కోసం మొత్తం రూ.10,091 కోట్లు ఖర్చు విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళతాయని వెల్లడించారు. గతంలో ‘అమ్మఒడి’కి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని, అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే.. ఇప్పుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నామని ఆయన తెలిపారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 42,61,965 మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రస్తుతం 67,27,164 మందికి తల్లికి వందనం వర్తింపజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంటే, గతంతో పోలిస్తే అదనంగా 24,65,199 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. దీంతో ప్రభుత్వంపై రూ.5,540 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు.
జూన్ 26 వరకు ఫిర్యాదుల స్వీకరణ:
తల్లికి వందనం పథకం జాబితాలను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలను, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఎక్కడైనా పొరపాట్లు తలెత్తితే సరిదిద్ది తుది జాబితాలను రూపొందిస్తారు. జూన్ 26 వరకు ఫిర్యాదులను స్వీకరించి జూన్ 30న తుది జాబితాలను ప్రకటిస్తారు.
‘అమ్మ ఒడి’ పథకానికి, ‘తల్లికి వందనం’ పథకానికి తేడాలు:
ఈ రెండు పథకాలు కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి:
అంశం అమ్మ ఒడి తల్లికి వందనం
ప్రవేశపెట్టిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం (తెలుగుదేశం, జనసేన, బీజేపీ)
పథకం ఉద్దేశ్యం విద్యార్థులను డ్రాపవుట్స్ కాకుండా నివారించడం విద్యార్థుల విద్యకు ఆర్థిక చేయూత అందించడం
అందించే మొత్తం రూ.15,000 (ఇందులో రూ.2,000 పాఠశాల నిర్వహణకు, రూ.13,000 తల్లి ఖాతాలో జమ) రూ.15,000 (ఇందులో రూ.2,000 పాఠశాల నిర్వహణకు, రూ.13,000 తల్లి ఖాతాలో జమ)
కుటుంబంలో పిల్లల సంఖ్య ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవారు (కొన్ని పరిమితులు ఉండేవి) కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తున్నారు
ప్రధాన అర్హత తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు (తెల్ల రేషన్ కార్డు ప్రస్తావన లేదు)
‘తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల విద్యకు మద్దతుగా కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక చర్య. గతంలో అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకంతో పోలిస్తే, ‘తల్లికి వందనం’లో ఒక ముఖ్యమైన ప్రయోజనం ఉంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా వారందరికీ ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa