ట్రెండింగ్
Epaper    English    தமிழ்

400 సార్లు రిజెక్టెడ్ పీస్.. రూ.లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ

business |  Suryaa Desk  | Published : Sun, Jun 15, 2025, 09:25 PM

ఈ మధ్య కాలంలో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మార్కులు సరిగా రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయితే.. జీవితంలో విఫలమైనట్లు బాధపడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 400 సార్లు జాబ్ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఆ మనిషి ఏమైపోవాలి? అయితే చాలా మంది లాగా ఆయన నిరాశలో మునిగిపోలేదు. ప్రయత్నం లోపం లేకుండా పట్టుదలతో శ్రమించారు. ప్రస్తుతం 130 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11 లక్షల కోట్లు) మర్కెట్ వ్యాల్యూ సాధించబోతున్న ప్రఖ్యాత కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అయ్యారు. ఆయనెవరో కాదు.. దిగ్గజ సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా . ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.


నికేష్ అరోరా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాల గురించి 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం కోసం చాలా కంపెనీలకు దరఖాస్తు చేసుకునే వాడినని చెప్పారు. కానీ తనకు ప్రతిసారీ తిరస్కరణ లేఖలే వచ్చేవని వెల్లడించారు. అలా దాదాపు 400 జాబ్ అప్లికేషన్లు రిజెక్ట్ అయినట్లు తెలిపారు. అన్ని రిజెక్షన్లు ఎదురైనా.. తాను నిరాశ చెందలేదన్నారు. చివరికి ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీలో ఉద్యోగం దొరికిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇంత పెద్ద కంపెనీ సీఈఓగా ఎంపికై.. విజయం సాధిస్తే ఎలా ఉంటుందో ఆయనకు తెలిసినప్పటికీ.. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఆ తిరస్కరణ లేఖలను ఇప్పటికీ తన బీరువాలో పెట్టుకోవడం గమనార్హం. అవి తనను నిరంతరం ముందుకు సాగాలి అంటూ గుర్తు చేస్తూ ఉంటాయన్నారు నికేష్.


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించిన నికేష్ అరోరా.. IIT-BHU(వారణాసి)లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్ కాలేజ్, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టాలు పొందారు. అయితే ఉన్నత విద్యావకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు తన దగ్గర కేవలం 100 డాలర్లు మాత్రమే ఉండేవని నికేశ్ చెప్పారు. అందుకే అప్లికేషన్ ఫీజులు లేని విద్యాసంస్థల కోసం ప్రయత్నించానని గుర్తుచేసుకున్నారు. నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ నికేష్‌కు స్కాలర్‌షిప్ ఆఫర్ చేసినా.. కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకోమని సూచించింది. అరోరాకు వేరే అవకాశం లేకపోవడంతో దానేకే అంగీకరించారు.


నికేష్ అరోరా 1992లో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో చేరారు. అక్కడ వివిధ హోదాల్లో పనిచేసి చివరికి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. అయితే ఆయన ఫైనాన్స్‌కు పనికిరాడని చాలామంది అనేవారు. కానీ వాటిన్నింటినీ నికేష్ పట్టించుకోలేదు. నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీ సంపాదించి CFA (Chartered Financial Analyst) సర్టిఫికేషన్ పొందారు. 2004లో గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడానికి ఆయనకు ఈ సర్టిఫికేషన్ సహాయపడింది.


అలా గూగుల్‌లో నికేష్ అరోరా పదేళ్లు పనిచేశారు. గూగుల్‌లో తన ప్రయాణం "అద్భుతం" అని చెప్పేవారు. గూగుల్‌ను ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. "ముందుకు సాగడానికి ఇదే సమయం. నేను ఇంకా ఏదో కొత్తగా చేయాలనుకున్నాను" అని చెప్పారు.


గూగుల్ తర్వాత ఆయన సాఫ్ట్‌బ్యాంక్‌లో చేరారు. అక్కడ CEO మసయోషి సన్ ఆయనను కంపెనీ ప్రెసిడెంట్, COOగా ఎంపిక చేశారు. కొన్ని కారణాల వల్ల రెండున్నరేళ్లు సాఫ్ట్‌బ్యాంక్‌లో పనిచేసి.. తర్వాత కంపెనీని విడిచిపెట్టవలసి వచ్చింది. అనంతరం 2018లో పాలో ఆల్టోలో చేరారు నికేష్. ఆయన పాలో ఆల్టోలో చేరినప్పుడు ఆ కంపెనీ విలువ 18 బిలియన్ డాలర్లు. ఇప్పుడా టెక్ సంస్థ వ్యాల్యూ 118 బిలియన్ డార్లుగా ఉంది. 130 బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి చేరువలో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa