ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్.. కేరళలో బ్రిటన్‌ యుద్ధ విమానం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 07:56 PM

కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో.. బ్రిటన్ అత్యాధునిక ఎఫ్-35బీ ఫైటర్ జెట్ నిలిచిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది. మెకానికల్ సమస్యతో ఈ యుద్ధవిమానం అక్కడే ఉండిపోయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ఖరీదైన ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌గా పేరుగాంచిన ఈ ఎఫ్-35బీ యుద్ధ విమానంలో మెకానికల్ సమస్య తలెత్తినట్లు భావిస్తున్నారు. ఈ ఎఫ్-35బీ యుద్ధ విమానం.. బ్రిటన్ హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో ఒక భాగం. ఇటీవల ఇండో-పసిఫిక్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా జరిగిన యుద్ధ విన్యాసాల్లో ఈ ఫైటర్ జెట్ పాల్గొంది.


ఇంధనం తగ్గడంతో ఈ యుద్ధ విమానాన్ని.. ఆదివారం తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని మొదట అంతా భావించారు. అయితే 2 రోజులు గడిచినా అది ఇంకా కదలకపోవడంతో.. దానికి ఏదో మెకానికల్ సమస్య వచ్చి ఉంటుందని సంబంధిత నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఎఫ్-35 బీ ఫైటర్ జెట్‌కు అవసరమైన సర్వీసింగ్ చేసి.. దాన్ని తిరిగి హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్‌పైకి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ యుద్ధ విమానానికి సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సెక్యూరిటీగా ఉన్నారు.


ఎఫ్-35బీ విశిష్టతలు, ప్రాముఖ్యత


ఒక విదేశీ ఫైటర్ జెట్ మన దేశంలో రెండు రోజులపాటు ఆగిపోవడం.. అది కూడా ఎఫ్-35బీ వంటి 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ టెక్నికల్ సమస్యతో మోరాయించడం చిన్న విషయమేమీ కాదు. ఈ ఫైటర్ జెట్ తక్కువ దూరంలోనే గాల్లోకి ఎగరడం (షార్ట్ టేకాఫ్‌) తోపాటు వర్టికల్ ల్యాండింగ్ (నిట్టనిలువుగా ల్యాండ్) అయ్యే కెపాసిటీ కలిగి ఉంటుంది. అమెరికా సహా చాలా దేశాల ఎయిర్‌ఫోర్స్‌ల వద్దే ఈ అత్యాధునికమైన ఫైటర్ జెట్ అందుబాటులో ఉంది. ఇందులో మరో వేరియంట్ ఫైటర్ జెట్‌ను ఇరాన్‌పై చేస్తున్న దాడుల్లో ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా వాడుతోంది.


అయితే ఈ ఏడాది మొదట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ 5వ తరం యుద్ధ విమానాలను భారత్‌కు అందించేందుకు ఆఫర్ చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్రంప్ పక్కనే ఉన్నారు. భారత్‌కు ఎట్టకేలకు ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను అందించడానికి మార్గం సిద్ధం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్-35బీ ఫైటర్ జెట్ భారతలో నిలిచిపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa