భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌లింక్‌కు లైసెన్స్ మంజూరు కావడంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గ్వినే షాట్‌వెల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలవంతంగా జరిగిందని, భారత్‌లో స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఇవ్వడాన్ని షాట్‌వెల్ ప్రశంసించారని మంత్రి తెలిపారు.ఈ సమావేశం గురించి కేంద్ర మంత్రి సింధియా 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "భారతదేశంలో కనెక్టివిటీ రంగంలో తదుపరి దశకు సంబంధించి స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ సీఓఓ గ్వినే షాట్‌వెల్‌తో ఫలవంతమైన సమావేశం జరిగింది. డిజిటల్ ఇండియా యొక్క అపారమైన ఆకాంక్షలకు ఊతమివ్వడానికి, దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడానికి శాటిలైట్ కమ్యూనికేషన్లలో సహకార అవకాశాలపై లోతుగా చర్చించాం" అని ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ విప్లవంలో దూసుకుపోతోందని, ఈ తరుణంలో శాటిలైట్ సాంకేతికతలు కేవలం సంబంధితమైనవి మాత్రమే కాకుండా, పరివర్తనాత్మకమైనవని సింధియా అభిప్రాయపడ్డారు. స్టార్‌లింక్‌కు లైసెన్స్ మంజూరు చేయడం ఈ ప్రయాణంలో గొప్ప ప్రారంభమని షాట్‌వెల్ అన్నట్లు మంత్రి తెలిపారు.తక్కువ భూకక్ష్య ఉపగ్రహాలను ఉపయోగించి మారుమూల ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడమే స్టార్‌లింక్ లక్ష్యం. ఈ నెల ప్రారంభంలో స్టార్‌లింక్ సంస్థకు దేశంలో వాణిజ్య సేవలు అందించేందుకు వీలుగా శాట్‌కామ్ లైసెన్స్ లభించిన విషయం తెలిసిందే. బహుశా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్‌లింక్ తన సేవలను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టెలికమ్యూనికేషన్ల విభాగం ఈ అమెరికన్ కంపెనీకి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ అనుమతిని జారీ చేసింది.స్టార్‌లింక్ సంస్థ తన ఆసక్తి వ్యక్తీకరణ పత్రంలో పేర్కొన్న అన్ని భద్రతా నిబంధనలను పాటించినందున, రాబోయే రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో-ఎస్ఈఎస్ తర్వాత, దేశంలో జీఎంపీసీఎస్ అనుమతి పొందిన మూడవ శాట్‌కామ్ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు స్పెక్ట్రమ్ కేటాయించడానికి ముందు, స్టార్‌లింక్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్-స్పేస్ నుండి ఆమోదం పొందాల్సి ఉంది. దీనికి సంబంధించిన అవసరమైన పత్రాలను ఇప్పటికే సమర్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa