అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. ఒకే ఒక్క రోజులో ఒక మత్స్యకారుడి జీవితం అనూహ్యంగా మారిపోయింది. ఒడిశాలోని బాలాసోర్‌కు చెందిన నానీ గోపాల్ అనే జాలరిని గంగమ్మ కరుణించింది. అతను వేసిన వలలో అరుదైన ‘తేలియా భోలా’ చేపలు చిక్కాయి. ఇవి ఏకంగా లక్షల్లో పలికి అతని జీవితానికి కీలక మలుపును తీసుకొచ్చాయి. ఈ సంఘటన స్థానిక మత్స్యకారులలో ఆశలు రగిలించడమే కాకుండా.. సముద్ర వనరుల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది.
నానీ గోపాల్‌కు కలిసొచ్చిన అదృష్టం ఊహించనిది. దిఘా నదీముఖద్వారం (డైవర్జెంట్ రివర్ మౌత్)లో అతను విసిరిన వలలో రెండు, మూడు కాదు.. ఏకంగా 29 అరుదైన తేలియా భోలా చేపలు ఒకేసారి పడ్డాయి. ఈ చేపలు ఒక్కొక్కటి 20 కిలోలకు పైగా బరువు ఉండటంతో.. మొత్తం బరువు వందల కిలోల్లో ఉంది. దీంతో అతని జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. ఈ తేలియా భోలా చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.. ముఖ్యంగా వాటిలోని ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబర్చారు.
నదీముఖద్వారంలోని చేపల వేలం కేంద్రంలో ఈ చేపలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. చివరికి.. ఈ మొత్తం 29 చేపలు రూ.33 లక్షల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇది నానీ గోపాల్‌కు అనూహ్యమైన ఆర్థిక లబ్ధిని చేకూర్చింది. ఒక్క రోజులో ఇంత భారీ మొత్తాన్ని సంపాదించడం అరుదైన సంఘటన. ఈ డబ్బుతో నానీ గోపాల్ తన కుటుంబానికి ఇక ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తోటి మత్య్సకారులు కూడా చేపలు పట్టుకునే మా వారిలో ఒకరు ఇలా లక్షాధికారి అయ్యారంటే తమకు కూడా సంతోషమే అని వారు ఆనందంలో ముగినితేలుతున్నారు.
తెలియా భోలా చేపలు ప్రపంచవ్యాప్తంగా వాటి ప్రత్యేకమైన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిని వివిధ రకాల తీవ్రమైన వ్యాధులకు మందుల తయారీలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా.. వీటి నుంచి సేకరించే కొన్ని రకాల పదార్థాలు క్యాన్సర్ చికిత్సలో.. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. సౌందర్య సాధనాల (కాస్మెటిక్స్) తయారీలో కూడా ఈ చేపల నుంచి లభించే సమ్మేళనాలను ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక లక్షణాల కారణంగానే ఈ చేపలకు మార్కెట్‌లో ఇంతటి అధిక ధర లభిస్తుంది.
ఈ సంఘటన ఒడిశాలోని తీర ప్రాంత మత్స్యకారులలో కొత్త ఆశలను చిగురింపజేసింది. సముద్రంలో ఇలాంటి అరుదైన మత్స్య సంపద తమకు కూడా దక్కాలని.. తమ జీవితాలు కూడా నానీ గోపాల్‌లాగే మారాలని వారు కోరుకుంటున్నారు. మత్స్యకారులు నిత్యం సముద్రంలో అనేక కష్టాలను, ప్రమాదాలను ఎదుర్కొంటూ జీవనం సాగిస్తారు. అలాంటి వారిలో ఒకరికి ఇలాంటి అదృష్టం కలసిరావడం వారికి మానసిక స్థైర్యాన్ని, భవిష్యత్తుపై ఆశను కలిగిస్తుంది. ప్రభుత్వాలు కూడా మత్స్యకారుల సంక్షేమానికి, సురక్షితమైన మత్స్యకారుల విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇలాంటి సంపదను పెంపొందించడానికి, దానిని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేయాలి. మత్స్య సంపద దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa