ఇజ్రాయేల్‌కు మద్దతుగా ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు నేపథ్యంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నందుకుగాను ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న పాక్ ప్రకటనను ఎత్తి చూపుతూ.. ‘‘ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి దాడుల తర్వాతా ట్రంప్ శాంతి దూతేనా?’ అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఇరుదేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతలు తనవల్లే తగ్గాయని, యుద్ధాన్ని ఆపేశానంటూ అమెరికా అధ్యక్షుడు డప్పు కొట్టుకున్న విషయ తెలిసిందే. మధ్యవర్తిత్వం చేసినందుకు ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించనున్నట్లు పాకిస్థాన్ రెండు రోజుల కిందట అధికారికంగా ప్రకటించింది. ‘ఈ మధ్యవర్తిత్వం నిజమైన శాంతి దూతగా ట్రంప్ పాత్రను తేటతెల్లం చేసింది’ అని పాకిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది.
అయితే, ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై ఆదివారం రాత్రి దాడి జరిపిన వెంటనే, పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చింది. ‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి’ అన్న ఇస్లామాబాద్.. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఇరాన్‌కు తగిన రక్షణ హక్కు ఉందని పేర్కొంది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ.. ‘ఇప్పుడు పాకిస్థాన్ ప్రజలను అడగాలి... ఇప్పటికీ ట్రంప్‌కి నోబెల్ బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? వారే చెప్పాలి.. మీ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ట్రంప్‌తో విందు ఆరగించింది ఇలాంటి దాడుల కోసమేనా?’ అని ఎద్దేవా చేశారు. అణ్వాయుధాల సాకుతో ఇరాన్‌పై దాడులు జరిగాయని విమర్శించిన ఒవైసీ..‘ఇదే కథనంతో ఇరాక్‌లో ప్రవేశించారు.. ఏమీ బయటపడలేదు. లిబియాలో అదే పని చేశారు, అక్కడ కూడా అశాంతి తప్ప ఉపయోగం లేదు’ అని తెలిపారు. ఇక, భారత్, పాకిస్థాన్ యుద్ధం ఆపేసినా తనకు నోబెల్ రాదేమోనంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అమెరికా జరిపిన దాడుల్లో ఇస్ఫహాన్, ఫోర్దో, నతాంజ్ అణు కేంద్రాలు లక్ష్యంగా మారాయి. అమెరికా ఇరాన్‌లో అణు కేంద్రాలపై నేరుగా దాడికి దిగడం 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఇదే మొదటిసారి. ‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఇరాన్ ఇక శాంతికి ముందడుగు వేయాలి. లేకపోతే భవిష్యత్తులో దాడులు మరింత తీవ్రమవుతాయి’ అని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన ఇరాన్ విదేశాంగ శాఖ.. ఇజ్రాయేల్ వంటి హత్యా పాలకులతో కలిసి అమెరికా చేసిన దాడులు ఐక్యరాజ్యసమితి నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే.. ఇది అమెరికా విదేశాంగ విధానంలోని క్రూరత్వాన్ని, ఇరాన్ ప్రజల పట్ల ఉన్న శత్రుత్వాన్ని బయటపెట్టింది’ అని తీవ్రంగా విమర్శించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa