డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఏడాది కాలంలోనే చేసి చూపించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఊహించిన దానికంటే ఎక్కువగానే పనులు చేశామని, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవంతో, ప్రతిసారీ సమర్థవంతమైన, సుపరిపాలన అందించానని గుర్తుచేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారి అసమర్థ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతిన్నదని ఆరోపించారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర ప్రగతి ఆగిపోయిందని, ఈ 'మూడు ముక్కలాట'తో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, వైసీపీ హయాంలో నిధులు పక్కదారి పట్టి దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి కీలక దస్త్రాలపై సంతకాలు చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 213 అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, అదే రోజున ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పథకం హామీని నిలబెట్టుకున్నామని, అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నామని తెలిపారు.రాయలసీమలో ముఠా తగాదాలను పూర్తిగా అరికట్టామని, గంజాయి సాగును సమూలంగా నిర్మూలించామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతి నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించామని, మూడేళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు కేటాయించారని, విశాఖ రైల్వే జోన్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నామని, ఇప్పటివరకు 31 పారిశ్రామిక పాలసీలను తీసుకొచ్చామని పేర్కొన్నారు.స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ధ్యేయంగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.6 లక్షలుగా ఉందని, 2047 నాటికి దీనిని రూ.55 లక్షలకు పెంచడమే లక్ష్యమని నిర్దేశించారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెరిగితే నిరంతరాయంగా రెవెన్యూ వృద్ధి చెందుతుందని, 2029 నాటికి తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ గణనీయంగా పెరగాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి, ఈ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీ-4 పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెలివితేటలను ఆచరణలో పెట్టినప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని స్పష్టం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa