రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వీటిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా ఉపేక్షించేది లేదని, వారిని తొక్కుకుంటూ ముందుకెళతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణ పూర్తిగా గాలికొదిలేశారని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకు టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం నాడు గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం శ్రీకన్వెన్షన్‌లో విద్యార్థులు, యువతతో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. "రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ముఠా కక్షలకు తావులేదు. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అణచివేసింది తెలుగుదేశం పార్టీయే. మతసామరస్యాన్ని కాపాడతాం, విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఉపేక్షించం. గంజాయి బ్యాచ్‌కు అండగా నిలిచిన వారికి తగిన గుణపాఠం చెబుతాం" అని సీఎం ఉద్ఘాటించారు.గంజాయి నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా కలిసిరావాలని కోరారు. "ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోవాలి కానీ, తప్పుడు పనులతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే కుదరదు. 2021లో దేశవ్యాప్తంగా పండిన మొత్తం గంజాయిలో 50 శాతం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచే ఉత్పత్తి కావడం, దానికి విశాఖపట్నం కేంద్రంగా మారడం తీవ్ర ఆవేదన కలిగించింది" అని ఆయన అన్నారు.గంజాయికి బానిసలవడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల మెడికల్ షాపుల్లో కూడా మత్తుపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారం ఉందని తెలిపారు. "గంజాయిపై రాష్ట్రవ్యాప్తంగా 'ఈగల్' పేరుతో డేగ కన్ను వేసి ఉంచుతాం. ఇప్పటికైనా మారకపోతే అలాంటి వారు రాష్ట్రంలో ఉండేందుకే అనర్హులు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే, అదే వారికి చివరి రోజు అవుతుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, "రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేశాం. పాఠశాలల్లో ఈగల్ క్లబ్‌లు నెలకొల్పాం. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే '1972' నంబర్‌కు మెసేజ్ పంపితే తక్షణమే రక్షణ చర్యలు తీసుకుంటాం. మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో 2 శాతాన్ని డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలకు కేటాయిస్తాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 56 డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం" అని చంద్రబాబు ప్రకటించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం నిర్వహించేందుకు సినీనటులు కూడా ముందుకు రావాలని, ప్రజా చైతన్యం కోసం కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa