ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహేతర సంబంధాలు, హత్యలు.. ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:10 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు తీవ్రంగా స్పందించారు. "భర్తలను ఎలా చంపాలో.. భార్యలే స్కెచ్ వేస్తున్నారు.. వాహ్!" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధాల కారణంగా భార్యలు తమ భర్తలను చంపడానికి ప్లాన్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. "సమాజంలో భర్తలను భార్య.. తల్లిని బిడ్డ.. చంపడం చూస్తుంటే బాధ అవుతోంది" అని కూడా ఆయన అన్నారు. హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పెరగడానికి కారణాలేంటి? ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి? దీనికోసం ప్రభుత్వాలు, ప్రజల ముందు ఉన్న బాధ్యతలేంటో? ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ తరహా నేరాలకు సంబంధించి సమగ్రమైన, సంవత్సరం వారీగా అధికారిక గణాంకాలు పరిమితంగానే ఉన్నప్పటికీ.. పోలీసుల రికార్డులు, వార్తా కథనాలు ఈ పరిస్థితి తీవ్రతను చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పోలిస్తే.. గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వివాహేతర సంబంధాలు, లవ్ అఫైర్స్ వల్ల నేరాలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.


తెలంగాణలో 2022 ప్రారంభం నుంచి మే వరకు నమోదైన దాదాపు 24 హత్య కేసులకు.. వివాహేతర సంబంధాలే కారణం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2021లో హైదరాబాద్‌లో 60శాతం (85) హత్యలు వివాహేతర సంబంధాల కారణంగానే జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక 2020లో హైదరాబాద్‌లో 64 హత్యలు ఇలాంటి కారణాల వల్లే జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 వరకు.. మహిళలపై నేరాలు పెరిగనట్లు తెలుస్తోంది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు ఎక్కువగా జరగినట్లు సమాచారం.


అలాగే ఆంధ్రప్రదేశ్‌లో.. NCRB డేటా ప్రకారం 2020లో వివాహేతర సంబంధాలు, లవ్ అఫైర్స్ వంటి కారణాల వల్ల 168 హత్యలు జరిగాయి. ఇక 2015లో నమోదైన 1099 మర్డర్ కేసుల్లో 198 హత్యలకు అవే కారణం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో జరిగిన హత్యల్లో 15% (385) వివాహేతర కారణాల వల్లే జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


గత ఐదేళ్లలో అధికం..


గత ఐదేళ్లలో, ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత, వివాహేతర సంబంధాలు, ప్రేమలో మోసం, ప్రేమ, కులాంతర వివాహాలకు కుటుంబాల వ్యతిరేకత వంటి కారణాలతో హత్యలు, ఆత్మహత్యలు, దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ కేసుల్లో.. భర్తలు తమ భార్యలను లేదా వారి ప్రియురాళ్లను హత్య చేయడం, ప్రియుడితో కలిసి భార్యలు తమ భర్తలను చంపడానికి కుట్రలు పన్నడం, లవ్ ట్రయాంగిల్స్.. వంటివి ఉన్నాయి. అయితే ఈ నేరాలు కేవలం ఆవేశంలో జరిగినవి కాదని.. నెలల తరబడి పథకాలు వేసి, పక్కాగా అమలు చేసినవిగా పోలీసులు చెబుతున్నారు. నేరస్థుల్లో ఉండే ద్వేషం, కోపం కిరాతకంగా హత్య చేయడానికి పురిగొల్పుతున్నాయని నిపుణులు తెలిపారు. చంపడానికి పదునైన ఆయుధాలు వాడుతున్నారు. కొందరు విషం ఇచ్చి, గొంతునులిమి ప్రాణాలు తీస్తున్నారు. మరికొందరు చంపడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇస్తున్నారు.


కారణాలు ఏంటి?


సమాజంలో వ్యక్తిగత సంబంధాలలో ఏర్పడిన మార్పులు, ఒత్తిడి కారణంగా ఈ తరహా నేరాలు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల వాడకం పెరగడం కూడా వివాహేతర సంబంధాలను అధికమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌ల ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు, అనుబంధాలు కొన్నిసార్లు గృహ హింసకు, విడాకులకు, చివరికి హత్యలకు దారితీస్తున్నాయి.


అసూయ, మోసం, వివాహేతర సంబంధాన్ని దాచడం.. వంటి కారణాలు ఇలాంటి నేరాలకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా.. లైంగిక అసూయ (Sexual Jealousy), ఎమోషనల్ యాంగర్ చంపే తీవ్రతను పెంచుతున్నాయి. ఆర్థిక కారణాలు కూడా ఇలాంటి హత్యలకు పురిగొల్పుతున్నాయి. అంతేకాకుండా.. ప్రేమ సంబంధిత గొడవలు హింసాత్మక నేరాలకు దారితీస్తున్నాయి. ఇందులో.. పెద్దలకు ఇష్టం లేని, కులాంతర వివాహాలు, కులాంతర ప్రేమలు, మాజీ ప్రేమికులకు సంబంధించిన కేసులు ఉన్నాయి.


సుప్రీంకోర్టు 2018లో అడల్ట్రీని నేరం కాదని (Decriminalized Adultery) తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం, వివాహేతర సంబంధం ఇకపై క్రిమినల్ నేరం కాదు. ఇప్పుడు అది విడాకులకు ఒక ప్రధాన కారణంగా ఉంది. అయితే, ఈ చట్టపరమైన మార్పులు వచ్చినా, సమాజంలో వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, గృహహింస వంటి నేరాల సంఖ్య తగ్గలేదు. న్యాయపరంగా దీనికి నేరపూరిత శిక్ష లేనప్పటికీ, సామాజిక పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.


ప్రభుత్వం, ప్రజలు ఏం చేయాలి?


మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు


ప్రభుత్వం, పోలీసులు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వ్యక్తిగత సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, దంపతులు, కుటుంబ సభ్యులకు.. నిపుణులను సంప్రదించే అవకాశం కల్పించాలి.


పోలీసు కౌన్సిలింగ్


పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా 'ఫ్యామిలీ కౌన్సిలింగ్ విభాగాలు' ఏర్పాటు చేయాలి. కుటుంబ కలహాలు, సంబంధాల సమస్యలతో వచ్చే వారికి కేసులు పెట్టడానికి బదులుగా.. ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. సైబర్ నేరాల నియంత్రణ సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా జరిగే మోసాలు, బెదిరింపులను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలి. ఈ నేరాలపై త్వరగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.


అవగాహన కార్యక్రమాలు


విద్యార్థులకు, యువతకు పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యం, సంబంధాల నిర్వహణ, సామాజిక విలువలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.


సామాజిక బాధ్యత


మీడియా, సినిమా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు సంబంధాలను తప్పుగా చిత్రీకరించకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నేరాలను గ్లామరైజ్ చేయకుండా, వాటి పర్యవసానాలను చూపించాలి.


ఇలాంటి నేరాల సంఖ్య పెరుగుతుండటం సమాజంలో నైతిక విలువల పతనాన్ని, మానవ సంబంధాల బలహీనతను ప్రతిబింబిస్తోంది. పోలీసు యంత్రాంగం ఈ నేరాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, సామాజిక అవగాహ, కుటుంబ బంధాల బలోపేతం చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa