ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో ఇది చట్టబద్ధమేనా.. నెట్టింట తీవ్ర చర్చ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 08:19 PM

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఇళ్లు కొనుగోలు చేయడం సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొన్నా.. నెల నెలా ఈఎంఐలు కట్టలేక.. అప్పుల బాధలో మునిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దీంతో అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్న కుటుంబాలు అనేకం. మరోవైపు.. అద్దె ఇంటి రెంటు కూడా భారీగా ఉండటంతో అందులో కూడా ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దేశంలోని మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాల్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలతో విసిగిపోయిన ఓ నెటిజన్.. ఇంటి ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే మన దేశంలో ఇది చట్టబద్ధమా కాదా అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో నెటిజన్లు.. నెట్టింట తీవ్రంగా చర్చిస్తున్నారు.


అయితే తనకు ఇల్లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని పేర్కొన్న ఆ వ్యక్తి.. ఏకంగా ఒక హౌస్‌బోట్‌ కొని దానిపై నివసించడం భారత్‌లో చట్టబద్ధమేనా అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల్లో ఒక హౌస్‌బోట్ లభిస్తుందని.. దానిలో నివాసం ఉంటే.. వరదలు వచ్చినా తాను మునిగిపోకుండా తేలుతూనే ఉంటానని ఆ నెటిజన్ చేసిన పోస్ట్ తెగ వైరల్‌ అవుతోంది. అయితే.. ఈ ప్రశ్నకు చాలా మంది నెటిజన్లు సమాధానాలు ఇవ్వగా.. అనుకున్నంత సులువు కాదని.. ప్రభుత్వ నిబంధనలు, అధికారులకు లంచాలు వంటివి అడ్డుగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఇండియా రియల్‌ఎస్టేట్ సబ్‌రెడిట్‌లో ఒక నెటిజన్ తన ఆవేదనను బయటపెట్టాడు. "బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ఏ భారతీయ నగరంలోనూ ఫ్లాట్‌లు కొనే స్థోమత నాకు లేదు. ఇప్పటికే నాకు వయసు మించిపోయింది. ఈఎంఐలు చెల్లించడానికి అప్పటికి నేను పని చేయగలిగే వయస్సులో ఉండను" అని రాసుకొచ్చాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఓ ఆలోచనను నెట్టింట పెట్టాడు. "చిన్న పడవను అద్దెకు తీసుకోవడం లేదా కొనుగోలు చేయడం, దానిపై వంటగది, బాత్రూమ్, రెండు బెడ్రూమ్‌లు నిర్మించుకోవడం చట్టబద్ధమా?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని నగరాల్లో కొన్ని సరస్సులు ఉన్నాయని.. ఆ పడవలను సరస్సులు లేదా సముద్ర తీరంలో పార్క్ చేసి అక్కడ నివసించవచ్చా అని పేర్కొన్నాడు. పెరిగిన ఇళ్ల ధరలతో తాను తీవ్రంగా విసిగిపోయానని.. దీనిపై నెటిజన్ల నుంచి సలహా కావాలని కోరాడు.


సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు


అయితే ఆ వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్‌గా మారడంతో.. సోషల్ మీడియా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అందులో చాలా మంది.. ఈ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా అడ్డంకులు ఎదురవుతాయాని.. ఇలా చేయాలంటే అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.


ఇక మరికొందరు నెటిజన్లు సెటైరికల్‌గా సమాధానాలు ఇచ్చారు. ఈ ఆలోచన నచ్చిందని.. నగరాల్లో సరస్సులను పూడ్చి బిల్డర్లు అపార్ట్‌మెంట్లు కట్టారు కదా.. మరి ఇప్పుడు సరస్సు ఎక్కడ దొరుకుతుందో ఆశ్చర్యంగా ఉంది అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు.. నగరంలో కాకుండా దూరంగా నగర శివార్లలో ఇల్లు కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. అయితే ఆ ఇల్లు పడవలా సరదాగా ఉండదు కానీ కనీసం ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది కదా అని సూచించారు. ఇక మరో నెటిజన్.. ప్రభుత్వ ఆస్తిని బలవంతంగా ఆక్రమించినందుకు రూ. 60 లక్షల పన్ను చెల్లించడానికి మీరు సిద్ధమైతే ఇది నెరవేరుతుందని పేర్కొ్న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa