జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం 270 మందికిపైగా ప్రాణాలను బలితీసుకుంది, ఇది ఈ దశాబ్దంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచిపోయింది. ఈ ఘటనపై దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో జాప్యం, ప్రమాదంపై స్పష్టత లోపించడం వంటి అంశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో.. ఐక్యరాజ్య సమితికి చెందిన విమానయాన నిపుణులకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తునలో సహకారం అందించేందుకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (ICAO) ముందుకురావడం ప్రత్యేక విషయం.. కానీ, ఆ ఆఫర్‌ను కేంద్రం తోసిపుచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ 2014లో మలేషియా విమాన ప్రమాదం, 2020లో ఉక్రెయిన్ జెట్‌లైనర్ కూలిపోయిన దుర్ఘటనలపై దర్యాప్తునకు సహాయం చేయడానికి నిపుణులను పంపింది. అయితే, ఆ సమయంలో సంబంధిత దేశాలు ఏజెన్సీ సహాయం కోరాయి. కానీ, అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దర్యాప్తు విషయంలో మాత్రం ICAO స్వచ్ఛందంగా పరిశోధకుడిని పంపి "ఆబ్జర్వర్" హోదాలో పాల్గొనమని సూచించినా, భారత ప్రభుత్వం ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు రాయిటర్స్‌కు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని టైమ్స్ నౌ ఛానల్ గురువారం మొదటి ప్రసారం చేసింది.
భారత ప్రభుత్వం ప్రకారం.. బ్లాక్ బాక్స్ డేటాను ప్రమాదం జరిగిన రెండు వారాల తరువాత డౌన్‌లోడ్ చేసినట్లు తెలిపింది. కానీ, విమానయాన భద్రతా నిపుణులు ఈ జాప్యం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జూన్ 13న మొదటి బ్లాక్ బాక్స్, జూన్ 16న రెండోది వెలికితీసినా వాటి విశ్లేషణ ఎక్కడ జరుగుతుందనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 80 డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ.. కానీ తల్లీ, కుమార్తె దుర్మరణం
అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) కూడా ఈ దర్యాప్తులో భాగస్వామిగా ఉంది. దీంతో డేటా విశ్లేషణ భారత్‌లో జరుుగుతుందా? లేదా అమెరికాలోనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతర్జాతీయ విమానయాన రంగంలో కీలకమైన ICAO Annex 13 నిబంధనల ప్రకారం.. బ్లాక్ బాక్స్ డేటాను వెంటనే విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఆ డేటా ద్వారా భవిష్యత్ ప్రమాదాలను నివారించవచ్చునని నిపుణులు భావిస్తారు.
ప్రమాదం జరిగిన తరువాత కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకసారి మాత్రమే మీడియా సమావేశం నిర్వహించింది. కానీ ప్రశ్నలు అడగడానికి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు, ఇది పారదర్శకతపై సందేహాలు రేకిత్తిస్తోంది. అలాగే, ముందస్తు నివేదికను ప్రమాదం జరిగిన 30 రోజుల్లో విడుదల చేయాల్సిన ఉంది. సాధారణంగా విమాన ప్రమాదాలు అనేక కారణాల వల్ల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa