గతేడాది ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమకు ఎంతో సాయం చేసిన భారత్‌ను పక్కన పెడుతూ.. చైనా, పాకిస్థాన్‌లతో బంగ్లాదేశ్ అంటకాగుతోంది. ఆ రెండు దేశాలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. దీంతో చైనా, పాకిస్థాన్ కలిసి కొత్తగా ఒక కూటమిగా ఏర్పడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరేలో చైనాలోని కున్మింగ్‌లో జూన్ 19న చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం తరువాత, ఈ మూడు దేశాలు కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాయనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. కానీ, తాజాగా ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన త్రైపాక్షిక భేటీ రాజకీయపరమైనది కాదని, దీనిపై బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎం. తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడారు. అది కేవలం అధికారుల స్థాయి సమావేశం మాత్రమేనని, రాజకీయ స్థాయి సమావేశం కాదని ఆయన అన్నారు. భారత్‌ను పక్కన పెట్టే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నది మాత్రం కాదు" అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా బంగ్లాదేశ్ అధికారి భారత్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే.
కానీ, ఈ విషయంపై చైనా, పాకిస్థాన్ వేర్వేరు ప్రకటనలు చేశాయి. మూడు దేశాల సహకారంపై చర్చించామని, పరస్పర నమ్మకం, సమానత్వం, అభివృద్ధి ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించామని తెలిపాయి. అంతేకాకుండా, 'జాయింట్ వర్కింగ్ గ్రూప్'గా ఏర్పడాలని ఒక అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నాయి. అయితే, బంగ్లాదేశ్ మాత్రం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు గురించి తన ప్రకటనలో ప్రస్తావించలేదు. పాక్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ 'తుల్‌బుల్' ప్రాజెక్టును పునరుద్ధరించడానికి సిద్ధమవుతోన్న తరుణంలో కొత్త కూటమి తెరపైకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమూద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే
ఈ పరిణామాలపై భారత్ స్పందించింది. నిశితంగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ (MEA) గురువారం ప్రకటించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన ప్రయోజనాలు, భద్రతను ప్రభావితం చేసే పరిసర పరిణామాలపై మేము ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంటాం... ఒక్కో దేశంతో మన సంబంధాలు వాటి సొంత ప్రాధాన్యంతో ఉన్నా, పరిణామాలు, పరిస్తితులను దృష్టిలో ఉంచుకునేలా వాటిని మేము పరిగణిస్తాం’ అని చెప్పారు. ఇటీవల బంగ్లాదేశ్‌పై భారత విధించిన వాణిజ్య ఆంక్షలు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ స్పష్టత ఇచ్చారు.
‘‘ఈ నిర్ణయాలు బంగ్లాదేశ్ చర్యల ఆధారంగా తీసుకున్నవే. భారతదేశం ఎప్పటికప్పుడు ఈ సమస్యలను ప్రామాణిక చర్చల వేదికలపై, ముఖ్యంగా వాణిజ్య కార్యదర్శి స్థాయి సమావేశాల్లో కూడా ప్రస్తావించింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న వాటి పరిష్కారం కోసం మేము ఎదురుచూస్తున్నాం," అని తెలిపారు. భారత పత్తి, బియ్యం వంటి వస్తువుపైల ఆంక్షలు విధించిన తరువాత, భారత ప్రభుత్వం భద్రతా కారణాల నెపంతో నిషేధం అమలు చేసిందని చెప్పారు.
కున్మింగ్ సమావేశానికి బంగ్లాదేశ్ తరఫున విదేశాంగ కార్యదర్శి రుహుల్ ఆలం సిద్ధిఖీ, చైనా తరఫున ఉప విదేశాంగ మంత్రి సన్ వెయిడాంగ్, పాకిస్థాన్ తరఫున ఆసియా పసిఫిక్ అదనపు కార్యదర్శి ఇమ్రాన్ అహ్మద్ సిద్ధిఖీ హాజరయ్యారు. చైనాలో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి అమ్నా బాలోచ్ వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa