భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుండి ఎనిమిది రోజుల పాటు విదేశీ పర్యటనకు బయలు దేరారు. ప్రధాని మోదీకి ఈ పదేళ్ల కాలంలో ఇదే అత్యంత సుదీర్ఘ పర్యటనగా నిలవనుంది. జులై 2 నుంచి 9 వరకు అనగా 8 రోజుల్లో ఆయన ఐదు దేశాలలో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారు. త్వరలో బ్రెజిల్‌లో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలోనూ ప్రధాని పాల్గొంటారు.
ఈ పర్యటనలో భాగంగా.. గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, ఎనర్జీ వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంతో పాటు ఉగ్రవాద నిరోధక చర్యలపై మోదీ దృష్టి సారించనున్నారు. అలానే సుమారు మూడు దశాబ్దాల తర్వాత పశ్చిమాసియాలో భారత ప్రధాని తొలి పర్యటనగా ఇది నిలవనుంది. మోదీ పర్యటన జులై 2న ఘనా నుంచి ప్రారంభమై జూలై 9న నమిబియాలో ముగుస్తుంది.
గతంలో మోదీ జులై 2015లో ఆరు దేశాల్లో పర్యటించారు. మళ్లీ పదేళ్ల తర్వాత మోదీ ఇంత సుదీర్ఘ పర్యటనకు వెళ్తున్నారు. 5 దేశాల టూర్ గురించి మోదీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ‘రానున్న కొన్ని రోజులు నేను.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ నమీబియాలో దేశాల్లో నిర్వహించే వివిధ ద్వైపాక్షిక, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. ప్రపంచ నాయకులతో మాట్లాడటానికి, మన దేశాన్ని మెరుగుపరచడానికి ఉన్న మార్గాలను చర్చించడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పర్యటన వివరాలు చూద్దాం.
ఘనా
మోదీ పర్యటన ఘనాతో మొదలవుతుంది. జులై 2, 3 తేదీల్లో ఆయన ఘనాలో పర్యటించనున్నారు. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ‘గ్లోబల్ సౌత్, ఆఫ్రికన్ యూనియన్, పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సంఘంలో ఘనా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మా చారిత్రక సంబంధాలను మరింతగా పెంచుకోవడమే కాక.. ఇంధనం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి భాగస్వామ్యం వంటి రంగాల్లో సహా సహకారానికి కొత్త దారులను తెరవడమే లక్ష్యంగా నా పర్యటన సాగనుంది. తోటి ప్రజాస్వామ్య దేశంగా, ఘనా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవసూచకంగా భావిస్తున్నాను’ అని మోదీ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో
ఘనా పర్యటన తర్వాత మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. జులై 3, 4 తేదీల్లో మోదీ ఈ దేశంలో పర్యటిస్తారు. ‘ఈ పర్యటనలో భాగంగా నేను శ్రీమతి క్రిస్టీన్ కార్లా కంగలూను కలుస్తాను. ఆమె ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే ఇటీవల రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి శ్రీమతి కమలా పెర్సాద్-బిస్సేసర్‌ను కూడా కలవబోతున్నాను. సుమారు 180 సంవత్సరాల క్రితం భారతీయులు మొదటిసారిగా ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వచ్చారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య బంధాలను పునరుద్ధరించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని’ మోదీ పేర్కొన్నారు.
అర్జెంటీనా
ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి మోదీ అర్జెంటీనా పర్యటనకు వెళ్తారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరుపుతారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక శక్తి, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారం పెంచుకోవడంపై దృష్టి పెడతారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ వెల్లడించారు.
బ్రెజిల్
అర్జెంటీనా పర్యటన తర్వాత మోదీ బ్రెజిల్ వెళ్తారు. జులై 6-7 తేదీల్లో రియో డి జనీరోలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. ‘వ్యవస్థాపక సభ్యుడిగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారానికి కీలకమైన వేదికగా బ్రిక్స్‌కు భారతదేశం కట్టుబడి ఉంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, నేను అనేక మంది ప్రపంచ నాయకులను కూడా కలుస్తాను. దాదాపు ఆరు దశాబ్దాలలో ఒక భారత ప్రధానమంత్రి హోదాలో మొదటిసారిగా ద్వైపాక్షిక పర్యటన కోసం నేను బ్రెజిల్ వెళ్తుంది నేనే‘ అని మోదీ చెప్పుకొచ్చారు.
‘ఈ పర్యటన బ్రెజిల్‌తో మన సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను. ఈ పర్యటన నాకు.. నా స్నేహితుడు, అధ్యక్షుడు హెచ్.ఇ. లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో కలిసి పనిచేసే అవకాశం కల్పించబోతుంది’ అని మోదీ ప్రకటించారు. .
నమీబియా
ఈ పర్యటనలో భాగంగా మోదీ చివరగా నమీబియాకు వెళ్తారు. భారత ప్రధాని నమీబియాలో పర్యటించడం ఇది మూడోసారి. ‘ఈ పర్యటనలో నేను నమిబియా అధ్యక్షుడు డాక్టర్ నెతుంబో నంది-నదైత్వాను కలుస్తాను. మన ప్రజలు, మన ప్రాంతాల మధ్య బంధాల బలోపేతంతో పాటుగా విస్తృత గ్లోబల్ సౌత్ ప్రయోజనం కోసం కొత్త రోడ్‌మ్యాప్‌ను రూపొందించే మార్గాలపై చర్చించేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నమీబియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించడాన్ని నేను గౌరవసూచకంగా భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.
‘ఈఐదు దేశాల్లో నా పర్యటన గ్లోబల్ సౌత్ అంతటా మన బంధాల స్నేహాన్ని బలోపేతం చేస్తుందని.. అట్లాంటిక్ ఇరువైపులా మన భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అలానే బ్రిక్స్, ఆఫ్రికన్ యూనియన్, ఈకోవాస్(ఈసీఓడబ్ల్యూఏఎస్), కారికోమ్ (CARICOM) వంటి బహుపాక్షిక వేదికలలో మన భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని నేను నమ్ముతున్నాను’ అని మోదీ ప్రకటించారు.
ఈ పర్యటన ద్వారా భారతదేశం గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత, వ్యూహాత్మక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఈ పర్యటన భారతదేశానికి చాలా ముఖ్యమైనది. దీని ద్వారా ఇతర దేశాలతో సంబంధాలు మెరుగుపడతాయి. వాణిజ్యం, రక్షణ రంగాల్లో సహకారం పెరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa