దేశ రాజధాని ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం విధించిన ప్రభుత్వం... ఎండ్ ఆఫ్ లైఫ్ కింద డీజిల్ వాహనాల జీవితకాలాన్ని 10 ఏళ్లుగా, పెట్రోల్ వాహనాలకు 15 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ వాహనాలకు ఇంధనం నింపరాదని వివాదాస్పద ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సాంకేతికంగా ఈ నిబంధనలు అమలు కష్టసాధ్యమని ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ‘‘సాంకేతిక పరిమితుల వల్ల ఇలాంటి ఇంధన నిషేధాన్ని అమలు చేయడం చాలా కష్టతరమైన పని.. వాహనాలను నిర్వహణ సక్రమంగా ఉంటేవారిని శిక్షించకూడదు. దెబ్బతిన్న, మరమ్మతులకు గురైన వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకునే విధానంపై మేం పనిచేస్తున్నాం’’ అని తెలిపారు.
జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఉత్తర్వుల ప్రకారం.. 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు., 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు ‘ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్" గా పరిగణించి స్క్రాప్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని వెనుక ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 62 లక్షల వాహనాలు (కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రక్కులు, వింటేజ్ వాహనాలు) ప్రభావితమవుతున్నాయి.
వివాదాస్పద నియంత్రణ పద్ధతులు
నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలు: కాలం చెల్లిన వాహనాలను గుర్తించేందుకు ఢిల్లీ ప్రాంతంలోని 498 ఫ్యూయల్ స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటు చేసి, వాహన నంబర్లను స్కాన్ చేయాలని నిర్ణయించారు. అయితే, ఇవి ఏప్రిల్ 2019 తర్వాత జారీ చేసిన హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను సరిగా గుర్తించలేవని ప్రభుత్వమే అంగీకరించింది. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది.
తమ వాహనాల నిర్వహణ సక్రమంగా ఉన్నా.. కేవలం జవయసు కారణంగా వాటిని ‘స్క్రాప్’గా పరిగణించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘"16 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన తన Mercedes-Benz E280 V6 కండిషన్ చాలా బాగుంది.. కాలుష్యం తక్కువ. అయినా ఇది ఇప్పుడు 'వింటేజ్ స్క్రాప్'గా మారిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే, మరొకరు ఎనిమిదేళ్ల కిందట కొన్న తన రేంజ్ రోవర్‌ను చాలా తక్కువ వాడాను.. కానీ ఇప్పుడు దాన్ని తక్కువ ధరకే అమ్మాల్సి వచ్చింది’ అని వాపోయాడు.
వాహనం వయస్సు ఆధారంగా కాకుండా, వాస్తవ కాలుష్య ఉత్సర్గాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలను నిషేధించకూడదని డిమాండ్ చేస్తున్నారు. కొత్త వాహనం కొనాలంటే జీఎస్టీ, సెస్‌తో కలిసి సామాన్యుడికి తడిపిమోపుడవుతోంది. ఢిల్లీ తరువాత గురుగ్రామ్, నవంబర్ 1 నుంచి ఇదే విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. అయితే ఢిల్లీ పునరాలోచించడంతో ఇతర నగరాలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa