తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన హృదయవిదారక ఘటన కుటుంబాన్ని, సమాజాన్ని కన్నీటిలో ముంచెత్తింది. కూటమి సర్కార్ ప్రారంభించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఓ ఆలయం వద్ద షామియానా పనులు చేస్తున్న టీడీపీ కార్యకర్త కందుకూరి మునీశ్వర్ (37) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇనుప కడ్డీకి విద్యుత్ తీగ తగలడంతో ఈ అపశృతి చోటుచేసుకుంది.
మునీశ్వర్ మృతితో అతని కుటుంబం శోకసముద్రంలో మునిగింది. “లే నాన్న.. మాతో రా.. మాట్లాడు.. నువ్వు లేకపోతే అమ్మ, మేం బతకం.. మమ్మల్ని నీ దగ్గరకు తీసుకుపో” అంటూ అతని కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విచారాన్ని నింపింది.
ఈ దుర్ఘటన ఆలయ కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. విద్యుత్ తీగల వ్యవహారంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa