ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ చాలా సంతోషకరమైన రోజని,. జూలై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభసూచకం అని ఆయన అన్నారు. నీటి వినియోగదారులతో సమావేశమైన ఆయన రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తన లక్ష్యం అని ఆయన అన్నారు. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమని, ఇప్పుడు కాదని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు పథకం అమలు చేయనున్నట్టు ఉద్ఘాటించారు. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం ప్రారంభిస్తారని భావించారు. కానీ, దీని సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లపై ప్రభుత్వం అధ్యయనం జరిపి.. పథకాన్ని పక్కగా అమలుచేయడానికి ప్రణాళిక వేసింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ పథకంపై విదివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతోన్న విషయం తెలిసిందే.
అంతకు ముందు శ్రీశైల మల్లన్నకు చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. రాయలసీమ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ బాగుంటుందని ఆయన అన్నారు. నీళ్లే మనకు ముఖ్యమైన సంపద అని, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాల లాంటివని ఆయన అభివర్ణించారు. గతంలో రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలామంది అన్నారని, కానీ ఎన్టీఆర్ సీమ స్థితిగతులు మార్చేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నానని, సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెప్పారు.
గత ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. ఈ నెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ‘‘పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట.. అన్నీ మేమే తెచ్చాం" అని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉండాలనేది తన కోరిక అని చంద్రబాబు అన్నారు. తాము చేసిన అభివృద్ధిని హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారని చెప్పారు. సముద్రంలో కలిసే నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని, దీనివల్ల రెండు రాష్ట్రాల రైతాంగానికి మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే అది పోలవరం వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. సీమకు ఏమి చేయాలో తన దగ్గర ఒక ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని రోడ్ల వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉందని ఆయన అన్నారు. గతంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళమని, ఇప్పుడు పాలిష్డ్ రైస్ తిని చాలామంది షుగర్ వ్యాధి తెచ్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అందరూ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారని, చిరుధాన్యాలు తింటున్నారని చెప్పారు. కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాయలసీమ అన్ని రకాల పండ్లు పండే ప్రాంతమని ఆయన అన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతాలుగా మారుతున్నాయని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa